జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 40 మండలాల్లో వర్షం కురిసింది
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
సాగుబాట పట్టిన రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు
హన్మకొండ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 40 మండలాల్లో వర్షం కురిసింది. సగటున 16.9 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 14 మండలాల్లో 20 మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురియగా.. అత్యధికంగా తొర్రూరులో 97.8 మిల్లీమీటర్లు నమోదైంది. కాగా, తొలకరి జల్లులకు రైతులు దుక్కులు దున్నుకుని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గతేడాది జూన్‌లో మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేశాయి.
దీంతో వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరిగే సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఎదుగుదల దశలోనే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఈసారి రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, తొలకరి జల్లులతో మంగళవారం వరంగల్ నగరంతోపాటు జనగామ, పరకాల నియోజకవర్గాల్లోని విత్తన దుకాణాల వద్ద రైతుల సందడి కనిపించింది. గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు నచ్చిన కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసుకుని వెళ్లారు.