కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు.
త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్‌ల ప్రజలను హైదరాబాద్‌కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు.
మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి..
కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment