
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించాలని తలపెట్టిన కొంగరకలాన్‌లోని ప్రగతి నివేదన సభ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ కటౌట్లు వర్షం దాటికి కూలిపోతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే రేపటి మీటింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ ఈ సభ ద్వారా ఎన్నికల సమరభేరీ మోగించనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో అందరి దృష్టి కొంగరకలాన్ సభపైనే ఉంది. ప్రగతి నివేదన సభలో 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు.
కాగా, భారీ వర్షం దాటికి ఇప్పటికే సభాప్రాంగణాకి చేరుకున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురుస్తుండటంతో రేపటి సభ కోసం జరుగుతున్న పనులకు ఆటంకం ఏర్పడింది. రేపు ఉదయానికి వాతావరణం సద్దుమణుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నా.. ముందస్తుగా వర్షం పడితే ఎలా అనేదానిపై కసరత్తు చేయకపోవడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ నుంచి సభ కోసం పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. వీరందరికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంపై టీఆర్‌ఎస్ నేతలు దృష్టిసారించారు.