- జలాశయాలను ఆదుకుంటున్న వర్షాలు
- లక్షల ఎకరాల్లో పంటలకు మేలు
- ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటిమట్టాలు
- ఆయకట్టుదారుల్లో ఉత్సాహం
నిజాంసాగర్ : తుఫాను పుణ్యమాని కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొత్తనీటితో జల వనరులు కళకళలాడుతున్నాయి. రైతులు సంబరపడి పోతున్నారు.
జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల కింద పంటలు పండిస్తున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. వరుణుడిపై భారంతో ఆయకట్టుల కింద సాగుచేస్తున్న ఖరీఫ్ పంటలను వరుణుడు తుఫాను రూపంలో ఆదుకుంటున్నాడు. రెండుమూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది.
దీంతో ఆయకట్టు కింద సాగుచేస్తున్న లక్షల ఎకరాల పంటలకు మేలు చేకూరుతోంది. ముఖ్యంగా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలో సాగుచేస్తున్న సుమారు 1.4 లక్షల ఎకరాల పంటలు గట్టెక్కినట్లే. అలీసాగర్ రిజర్వాయర్ వరకు 8 మండలాల్లో రైతులు వరిపంట సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వరి పంటలకు సాగునీరు అత్యవసరంగా మారిన సమయంలో వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాడు. ఆయకట్టు పంటల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టిన రెండు రోజుల్లో వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టు నీటి విడుదలతో పాటు ఆయకట్టు పంటలకు సాగునీటి అవసరాలు తప్పాయి.
అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. వర్షాల వల్ల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో పాటు ఆయకట్టు కింద సాగుచేస్తున్న పంటలకు నీరు అందుతోంది. అందువల్ల ప్రాజెక్టు నీటి అవసరం లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ప్రాజెక్టులో నిల్వ అవుతోంది.
వర్షాభావ పరిస్థితుల్లో ఆయకట్టు కింద సాగుచేస్తున్న పంటలు గట్టెక్కుతాయో లేవోనన్న అనుమానంతో ఉన్న రైతులను వరుణుడి గట్టెక్కిస్తున్నాడు. అంతేకాకుండా సింగితం, కళ్యాణి రిజర్వాయర్లతో పాటు చెరువులు, కుంటల కింద, వ్యవసాయ బోరుబావులు, లిఫ్ట్ ఇరిగేషన్‌ల వద్ద సాగుచేస్తున్న వేల ఎకరాల్లో పంటలను వర్షాలు ఆదుకుంటున్నాయి. మరో పదిహేను రోజుల పాటు వర్షాలు ఇలాగే కురుస్తూ జలాశయాలను, చెరువులు, కుంటలను పూర్తిస్థాయి నీటిమట్టంతో నింపాలని ఆయకట్టు రైతులు వరుణుడిని వేడుకుంటున్నారు.
చిగురించిన ఆశలు
Published Mon, Sep 1 2014 3:24 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement