సాక్షి, హైదరాబాద్ : పండుగ సీజన్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగడంతో ఈ రద్దీ మరింతగా పెరిగింది. ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సులకు వెళ్దామని భావించిన చాలా మందికి ఆర్టీసీ కార్మికుల సమ్మె షాకిచ్చింది. దీంతో చేసేది ఏమి లేక చాలా మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.
ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి మరి దారుణంగా తయారైంది. రద్దీ పెరగడంతో ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి.. ప్రయాణికులను చెదరగొట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులను లైన్లలో ఉంచి రైలు ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment