రోహిత్ వేములది ఆత్మహత్యకాదని, ముమ్మాటికీ కేంద్రప్రభుత్వం చేసిన హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు. సెంట్రల్‌యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులకు సోమవారం సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటిం చారు. రోహిత్ వేముల తల్లి రాధికకు లక్ష రూపాయాల చెక్కును అందజేశారు. రిలే దీక్షల్లో ఉన్న ప్రజాసంఘాల నాయకులతో సీపీఐ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. వీసీ అప్పారావు కేంద్రమంత్రి ఒత్తిడితోనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. వీసీ, దత్తాత్రేయ, స్మతి ఇరానీ లను తొలగించి విచారణ చేపడితే ప్రజలకు నమ్మకం ఉంటుందన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి విశ్వజీత్‌కుమార్ మాట్లాడుతూ.. రోహిత్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐఎస్‌ఎఫ్ పూనుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు స్టాలిన్, వేణు పాల్గొన్నారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో పలువురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.