ఆరు దాటితే ఆగమే ! | Here Some Tips For Women To Escape danger Situations | Sakshi
Sakshi News home page

ఆరు దాటితే ఆగమే !

Published Fri, Nov 29 2019 7:58 AM | Last Updated on Fri, Nov 29 2019 7:58 AM

Here Some Tips For Women To Escape danger Situations - Sakshi

సాక్షి, సిటీ బ్యూరో: వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి బుధవారం రాత్రి సోదరికి ఫోన్‌ చేసి తన స్కూటీ పంక్చర్‌ అయిందని చెప్పారు. ఆ వేళలో రోడ్డుపై ఒంటరిగా ఉండొద్దని, సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వెళ్లమని సోదరి సూచించారు. దీనికి సమాధానంగా ప్రియాంక ‘అక్కడుంటే అందరూ చూస్తారంటూ’ జవాబు ఇవ్వడం కాల్‌ రికార్డింగ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. ఆమెకు ఈ భావన కలగడానికి కారణం... చీకటి పడితే ఆ రహదారుల వెంట సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలే.  

ఏ దారీ అతీతం కాదు... 
చీకటి పడిందంటే చాలు నగర శివార్లలోని అనేక రహదారులు అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వ్యవహారాలను అడ్డాలుగా మారుతున్నాయి. జనసమ్మర్థం ఉండే అంతర్గత రహదారులను మినహాయిస్తే ప్రధాన రోడ్లు, హైవేలతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సైతం వీటికి అతీతం కాదు. కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారిణులు, దాదాపు ప్రతిచోటా ఉంటున్న మందుబాబులతో అనునిత్యం భారీ వాహనాలు సంచరించే ఔటర్‌ రింగ్‌ రోడ్‌తో పాటు దాని అనుబంధ రహదారుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. లారీలను రోడ్డు పక్కన ఆపేసుకుంటున్న డ్రైవర్లు అక్కడే మద్యం తాగుతున్నారు. వీరితో పాటు అనేక మంది ఇతర వాహనచోదకలూ ఓఆర్‌ఆర్‌లోని కొన్ని ప్రాంతాలను ఓపెన్‌ బార్లుగా మార్చేస్తున్నారు. ఇక కొన్ని రహదారుల పక్కన వ్యభిచారం యథేచ్ఛగా సాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలు ప్రేమ జంటలకు నెలవుగా మారిపోతున్నాయి.  
 
నిషాలో జరిగే దారుణాలెన్నో... 
ఆయా ప్రాంతాల్లో నిషాలో జోగుతున్న డ్రైవర్లు అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పురుషులకే వీరితో ఇబ్బందులు తప్పట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మహిళలు విషయం వేరే చెప్పక్కర్లేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లు బాహాబాహీలకు దిగడం, ఇతరులపై దాడులు చేయడం, ప్రమాదాలకు కారకులుగా మారడం నిత్యకృత్యంగా మారిపోయింది. దాదాపు నిర్మానుష్య ప్రాంతాల మధ్య నుంచి సాగుతున్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)పైనే కాదు అనేక అంతర్గత రోడ్లలోనూ ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రియాంకరెడ్డిపై ఘాతుకం జరగడానికి ఓఆర్‌ఆర్, దాని సర్వీసు రోడ్లలో నెలకొన్న పరిస్థితులూ ఓ కారణంగానే చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న దురాగతాల్లో అతి తక్కువ మాత్రమే సంచలనంగా మారి పోలీసు రికార్డులకు ఎక్కుతున్నాయి. చిన్నాచితకా వ్యవహారాలను బాధితులు పోలీసుల వరకు తీసుకురాకుండానే సర్దుకుపోతున్నారు. మహా అయితే మరోసారి ఆ మార్గాన్ని అనుసరించకుండా వేరో దారిలో వెళ్తున్నారు.  
 
పెట్రోలింగ్‌కు ఇబ్బందులెన్నో...  
ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌ రోడ్, దాని సర్వీస్‌ రోడ్‌తో పాటు ఇతర ప్రధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నామమాత్రంగా ఉంటోంది. దీన్ని పరోక్షంగా అంగీకరిస్తున్న పోలీసులు.. ఇందుకు కారణాలు అనేకమని చెబుతున్నారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మొత్తం సైబరాబాద్, రాచకొండల్లోని వేర్వేరు శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్ల పరిధిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు తమ పరిధిలోని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులపై గస్తీకి ఇస్తున్న ప్రాధాన్యం ఓఆర్‌ఆర్, దాని సర్వీసు రోడ్లలో చేయడానికి ఇవ్వలేకపోతున్నారు. జనావాసాల్లో నేరాలు నిరో«ధించడానికి, సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు రాకుండా చూడటానికి, రద్దీగా ఉండే రహదారులపై ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓఆర్‌ఆర్, దాని సర్వీసు రోడ్లలో అవసరమైన స్థాయిలో గస్తీ ఉండట్లేదు. ప్రస్తుతమున్న గస్తీ సిబ్బంది, వాహనాలను పెంచడమో.. లేక ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడమో చేయాల్సిందేనని, అప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.  

ప్రాథమిక జాగ్రత్తలు అవసరం  
ప్రస్తుత ప్రపంచంలో మహిళలు సైతం పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ కారణం వల్లే అనివార్యంగా వేళలతో సంబంధం లేకుండా రహదారుల్లో సంచరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దుండగుల బారినపడకుండా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హాక్‌–ఐ, డయల్‌–100 వంటి వాటిని వాడుకోవడంతో పాటు స్వీయ జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేస్తున్నారు.  
 
►  ఏదైనా ఇబ్బంది, ముప్పు ఎదురైనప్పుడు భయాందోళనలకు లోనై (ప్యానిక్‌) ఆలోచనను కోల్పోకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. ఇలా జరిగితే అది దుండగులకు అనువుగా మారుతుంది.  
►  విద్యార్థినులు, ఉద్యోగినులు.. పోకిరీలు, ముష్కరులకు చెక్‌ చెప్పడం కోసం పెప్పర్‌ స్ప్రేను తమ వెంట ఉంచుకోవాలి. హ్యాండ్‌ బ్యాగ్‌లో ఇదే భాగంగా అయిపోవాలి. పెప్పర్‌ స్ప్రే అందుబాటులో  లేకుంటే కనీసం ఘాటైన వాసన గల సెంట్లు, స్ప్రేలు దగ్గర ఉంచుకోవాలి. 
►  ఎవరైనా దాడి చేసినా, వేధించినా, ఇతర ఘోరాలకు యత్నించినా వీటిని వారి ముఖంపై స్ప్రే చేసి తప్పించుకోవచ్చు. 
►  రాత్రి వేళల్లో, నిర్జన ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకు మహిళలు ఒంటరిగా సంచరించకపోవడం మంచిది.  
►  అత్యవసరమైన/తప్పనిసరి పరిస్థితుల్లో సంచరించే మహిళలు తమతో పాటు ఓ ఈలను ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఊదుతూ చుట్టపక్కల వారి దృష్టిని ఆకర్షించాలి.  
►   స్థానిక పోలీసుస్టేషన్, కంట్రోల్‌ రూమ్‌తో పాటు సన్నిహితుల నంబర్లు సెల్‌ఫోన్‌లోని స్పీడ్‌ డయల్స్‌ ఆప్షన్‌లో సేవ్‌ చేసుకోవాలి. అవసరమైతే వాటిని సేవ్‌ చేసిన బటన్‌ నొక్కిన వెంటనే అవతలి వారికి కాల్‌ వెళ్తుంది.  
►  ఒంటరిగా వెళ్తున్న వారు ఆటోలు, క్యాబుల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మహిళా ప్రయాణికులు ఉన్న షేర్‌ ఆటోలు, క్యాబుల్నే ఎక్కడం ఉత్తమం.  
►   తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా అద్దె వాటిలో వెళ్లాల్సి వస్తే అది ఎక్కే ముందు దాని నంబర్, డ్రైవర్‌ పేరు అడిగి తెలుసుకుని వాటిని సన్నిహితులు, స్నేహితులకు సంక్షిప్త సందేశం, ఫోన్‌కాల్‌ ద్వారా తెలపాలి.  
►  సన్నిహితులు, స్నేహితులు, కుటుంబీకులు సమీపంలో లేనివారు కనీసం పోలీసు కంట్రోల్‌ రూమ్‌ (100)కు ఫోన్‌ చేసి అయినా విషయం చెప్పాలి. ఇలా చేస్తున్న విషయం ఆ డ్రైవర్‌కు తెలిసేలా చేస్తే అతడు దుస్సాహసాలకు ఒడిగట్టే ధైర్యం చేయడు.  
►  మహిళలు, యువతులు వ్యక్తిగత పనులపై ఒంటరిగా బయటకు వస్తే ఓ రోజు ఎక్కడెక్కడకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే సంబంధీకులకు తెలపాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement