సాక్షి, హైదరాబాద్ : ‘దిశ’హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారో లేదో వెల్లడించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పౌర హక్కుల సంఘం (పీయూసీఎల్)–మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శాకాలను పోలీసులు అమలు చేసినదీ, లేనిదీ ఈ నెల 12న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ఆదేశించింది.
ఆ మార్గదర్శాకాల ప్రకారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుకు సంబంధించిన ఆధార పత్రాలను అందజేయాలని ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ ఇతరులను ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.
పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో నిందితులను కాల్చి చంపారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వివిధ మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ఇదే తరహాలో న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సభ్యుడు కె. రాఘవేంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను కలిపి ధర్మాసనం విచారించింది.
ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసులో శ్యాంబాబు అనే యువకుడి పాత్ర ఉందంటూ పోలీసులు అతన్ని మట్టబెట్టాలని ప్రయత్నించారని, పౌరహక్కుల సంఘాలు సకాలంలో కేసులు వేయడంతో చివరకు ఆ కేసుతో శ్యాంబాబుకు ప్రమేయం లేదని హైకోర్టు తేల్చిందని ఈ సందర్భంగా పిటిషనర్లు గుర్తుచేశారు. ‘దిశ’కేసులో నిందితులు రిమాండ్‌లో ఉండగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ పేరుతో ఘటనా స్థలానికి తీసుకువెళ్లి హత్య చేశారని ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే నిందితులను సమీపం నుంచి హతమార్చారని స్పష్టం అవుతోందన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయక్కర్లేదు: ఏజీ
అనంతరం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై దాఖలైన కేసులో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు 2014లో స్టే జారీ చేసిందని గుర్తుచేశారు.
పోలీసులపై 302 సెక్షన్ కింది కేసు నమోదు చేయాలని పిటిషనర్లు కోరడం చెల్లదని, ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందిస్తూ పీయూసీఎల్–మహారాష్ట్ర మధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ కేసు తీర్పులోని పేజీ 5లో ఇది స్పష్టంగా ఉందని గుర్తుచేసింది. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టం అవుతుందని గుర్తుచేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసి ఉంటే వాటికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరింది. తిరిగి అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ ఇదే తరహాలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను సుప్రీంకోర్టు సోమవారం విచారించి బుధవారానికి వాయిదా వేసిందని, అక్కడి కేసు విచారణ జరిగిన తర్వాత గురువారం ఈ పిల్స్‌ను విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏజీ అభ్యర్థన మేరకు ఇక్కడి కేసుల విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఈలోగా ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురి మృతదేహాలను ఈ నెల 13 వరకూ భద్రపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాల్ని భద్రపర్చేందుకు తగిన సౌకర్యాలు లేనట్లయితే వాటిని ఏసీ ఉన్న వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. మృతదేహాలు చెడిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని భద్రపర్చాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా ఉండేందుకు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని అమికస్ క్యూరీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment