‘మెట్రో గ్రౌండ్‌లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’
హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే, తాము నిరుద్యోగుల నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్‌ను వెనక్కి ఉపసంహకరించుకుంది.
తాము మాత్రం నాగోల్ మెట్రో గ్రౌండ్‌లో సభను నిర్వహించబోమని టీ జేఏసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మరికాసేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సభ నిర్వహణ కోసం హైకోర్టులో జరిగిన వాదోపవాదాలను టీజేఏసీ తరుపు న్యాయవాదులు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు.
ఎన్ని షరతులు పెట్టినా అంగీకరించామని, జల్లికట్టుతో నిరుద్యోగ నిరసన ర్యాలీని పోల్చారని మొత్తానికి ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండ్‌ను, హక్కులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేసిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఫంక్షన్‌హాలులో సమావేశాలు నిర్వహించుకోండని చెప్తున్నారంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సంబంధిత కథనాలకై చదవండి..
ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ
టీజేఏసీ ర్యాలీకి షరతులతో అనుమతి!
టీజేఏసీది హింసాత్మక చరిత్ర
జల్లికట్టు తరహాలో నిరుద్యోగ ర్యాలీకి ప్లాన్!