సాక్షి, హైదరాబాద్: నగరంలోని విలువైన భూములపై కన్నేసి, తప్పుడు పత్రాలతో కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి భాగస్వామి, న్యాయవాది శైలేష్ సక్సేనా మరోసారి అరెస్టు అయ్యారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న ఈయనను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పట్టుకున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడంపై రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇప్పటికే భూ కబ్జా కేసుల్లో దీపక్‌రెడ్డితో పాటు శైలే‹ష్‌ను గతేడాది సీసీఎస్ పోలీసులే అరెస్టు చేసిన విషయం విదితమే.
గుడిమల్కాపూర్, భోజగుట్ట ల్లో ఉన్న భూమిని అయోధ్య నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం 2008లో జీవో 455 జారీ చేసింది. అయితే ఈ భూమిని కాజేసేందుకు దీపక్‌రెడ్డి, సక్సేనాలు భారీ కుట్ర చేశారు. భూమి అసలు యజమాని జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ వారసులంటూ కొందరు బోగస్ వ్యక్తుల్ని తెరపైకి తీసుకువచ్చారు. శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా మార్చి భోజగుట్ట భూమికి చెందిన భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తర్వాత బషీర్ అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ వారసుడంటూ షకీల్ ఇస్లాం ఖాన్ పేరుతో తెరపైకి తెచ్చారు.
ఇతడితో భోజగుట్ట భూమి తనదే అంటూ 2008, 2009, 2012ల్లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు చేయించారు. ఆపై షకీల్ తమకు భూమిని విక్రయిం చాడని, అందువల్ల అయోధ్య సొసైటీకి ప్రభుత్వ కేటాయింపు చెల్లదని, దాన్ని రద్దు చేయాలంటూ సక్సేనా తండ్రికి చెందిన జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్‌రెడ్డి, శైలజ అనే మహిళ 2014లో పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల వరకు కొన్ని పిటిషన్లపై విచారణ కొనసాగింది. అయితే దీపక్‌రెడ్డి, శైలే‹ష్, శైలజ వేసిన పిటిషన విచారణ జరగలేదు. దీంతో సిబ్బందిఫైళ్ల కోసం వెతికినా లభించలేదు. దీనికి తోడు సీసీఎస్ పోలీసులు గతేడాది జూన్ 6న దీపక్‌రెడ్డి, శైలేష్ తదితరుల్ని అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో అయోధ్యనగర్ సొసైటీ ప్రతినిధులు వివరాలు హైకోర్టు ముందుంచారు. పరిశీలించిన అనంతరం దీపక్‌రెడ్డి, శైలేష్ కుట్రలను గుర్తించిన న్యాయమూర్తి బోగస్ వ్యక్తుల పేర్లతో దాఖలు చేసిన 14 పిటిషన్లనూ కొట్టేశారు. శైలేష్ తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదైంది. ఇది దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయింది. ఈ కేసులో శైలేష్ నాంపల్లి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని రద్దు చేయించారు. శైలేష్ కోసం గాలించి పట్టుకున్నారు. అతడి నుంచి 11 బోగస్ గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment