ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిందే | high court must be split, telangana government | Sakshi
Sakshi News home page

ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిందే

Published Wed, Apr 1 2015 2:30 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిందే - Sakshi

ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిందే

 ఉన్నత న్యాయస్థానానికి టీ సర్కార్ నివేదన
     రెండు హైకోర్టులను ప్రస్తుత ప్రాంగణంలోనే ఏర్పాటు చేయొచ్చు.. లేకుంటే గచ్చిబౌలిలో
     ఏ రాష్ట్ర హైకోర్టునైనా నెలకొల్పొచ్చు
     {పస్తుత భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకూ సిద్ధం
     రాజధాని ప్రాంతంలోనే హైకోర్టు: ఏపీ సర్కార్
     విచారణ నేటికి వాయిదా
 సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని అధికరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాల్సిందేనని, దీని ప్రకారం ప్రస్తుత ఉమ్మడి హైకోర్టును విభజించి తీరాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టును విభజించి, రెండు రాష్ట్రాల హైకోర్టులను ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని స్పష్టం చేసింది. అలాగే అధికారులు తీసుకునే నిర్ణయం ఆధారంగా గచ్చిబౌలి ప్రాంతంలో 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త హైకోర్టు భవనాన్ని తెలంగాణ హైకోర్టుకు లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇవ్వడం తమకు ఆమోదయోగ్యమేనని తెలిపింది. అలాగే ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఏపీ హైకోర్టుకు కేటాయించి, తెలంగాణ హైకోర్టును గచ్చిబౌలిలో ఏర్పాటు చేయడానికి సైతం తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. గత వారం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఐ.వై.ఆర్.కృష్ణారావులు వాదనలను వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా భవానాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన కౌంటర్‌లోని పలు అంశాలను చదవి వినిపించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రానికి ఉన్న బాధ్యత ఏమిటో పరిశీలిస్తామని తెలిపింది. ప్రభుత్వానికి ఉండే అధికారం, బాధ్యత వేర్వేరని స్పష్టం చేసింది. బాధ్యత ఉంటేనే కేంద్రం తన అధికారాన్ని ఉపయోగించాలని ఆదేశిస్తామని, బాధ్యత లేని అంశాల్లో అధికారాన్ని ఉపయోగించాలని ఆదేశించలేమని తెలిపింది. తరువాత ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనల నిమిత్తం విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.
 
    రాజధాని ప్రాంతంలోనే హైకోర్టు: ఏపీ సర్కార్
 ‘రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చాక  కేంద్ర న్యాయశాఖ మంత్రి గత ఏడాది అక్టోబర్ 9న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీంతో అదే నెల 26న ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి నుంచి లేఖ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ లేఖకు ప్రతిగా ముఖ్యమంత్రి ఈ ఏడాది మార్చి 23న సమాధానం ఇచ్చారు. సీఆర్‌డీఏ చట్టం కింద రాజధాని నిర్మాణం కోసం 30 వేల ఎకరాల భూమిని గుర్తించాల్సి రావడమే ఈ ఆలస్యానికి కారణం.

రాష్ట్ర ప్రజలు కొత్త రాజధాని ఏర్పాటుతోపాటు హైకోర్టు ఏర్పాటు విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. రాష్ట్ర పాలనా యంత్రాంగం కూడా రాజధాని ప్రాంతంలోనే హైకోర్టు ఉం డాలని అంటోంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం కొత్త రాజ ధాని ఏర్పాటు కోసం కేంద్రం ఆర్థిక సాయం చేయాలి. హైకోర్టుతోపాటు ఇతర భవనాలు కూడా ఆర్థిక సాయం పొందే వాటిలో ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో మాకు ఏ అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి ప్రభుత్వ వైఖరిని తన లేఖ ద్వారా స్పష్టం చేశారు కాబట్టి, దానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఐ.వై.ఆర్.కృష్ణారావు తన కౌంటర్‌లో పేర్కొన్నారు.


    విభజిస్తేనే ధ్యేయం నెరవేరుతుంది: టీ సర్కార్
 ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేంత వరకు హైదరాబాద్‌లోని హైకోర్టు ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంది. సెక్షన్ 31 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యాకే ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టు అవుతుంది. రాష్ట్రాల పునర్విభజన తరువాత శాసనవ్యవస్థ, సచివాలయం విభజన జరిగి ఇరు రాష్ట్రాలు స్వతంత్రంగా పాలన సాగిస్తున్నాయి. అలాగే ప్రస్తుత హైకోర్టును సైతం విభజించి, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలి. ఇరు రాష్ట్రాలకూ వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో న్యాయవాదులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజన కోసం తెలంగాణ శాసనసభ మార్చి 18న ఏకగ్రీవ తీర్మానం చేసింది.

తీర్మానం ప్రతిని కేంద్ర న్యాయశాఖ మంత్రికి సమర్పించాం. హైకోర్టు విభజన కోరుతూ పలువురు ప్రజాప్రతినిధులు న్యాయశాఖ మంత్రితోపాటు ప్రధానికి వినతిపత్రాలు కూడా సమర్పించారు. దీంతో న్యాయశాఖ మంత్రి ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసినప్పుడే పునర్విభజన చట్టంలోని ధ్యేయం నెరవేరినట్లవుతుంది. హైకోర్టు విభజన జరిగితే ఉన్నత న్యాయవ్యస్థలో నియామకాలు జరుగుతాయని, అలాగే కింది స్థాయి న్యాయవ్యవస్థలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని, దీని ద్వారా రాష్ట్ర సాధన ఆశయం నెరవేరుతుందని భావిస్తున్నారు’ అని రాజీవ్‌శర్మ తన కౌంటర్‌లో పేర్కొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement