
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పాలా? లేక తమకు తెలిసిన కేసుల గురించి మాత్రమే చెప్పాలా? అన్న అంశంపై స్పష్టతనివ్వాలని హైకోర్టు గురువారం తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌కు నోటీసులు అందిన ప్రతి కేసులో కూడా న్యాయపరంగా వాదనలు వినిపిస్తున్నామన్నారు. పోలీసులు నమోదు చేసిన పలుకేసుల్లో వారి నుంచి కనీసం నోటీసులు కూడా రాలేదని, దీంతో ఆ కేసులకు సంబంధించిన పూర్తివివరాలు తెలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీని కేసుల వివరాలు ఇవ్వాలని కోరామన్నారు.
తరువాత హోంశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు తనకు తెలిసి తనపై ఉన్న కేసుల వివరాలు చెబితే చాలునన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో చెప్పాలన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తనకు తెలిసి తనపై ఉన్న కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిస్తే సరిపోతుందా? లేక అన్నికేసులనూ పొందుపరచాలా? అన్న విషయంపై స్పష్టతనివ్వాలని తేల్చి చెప్పారు.