‘గ్రూప్–2’పై స్టే పొడిగింపు
వచ్చే నెల 14 వరకు పొడిగించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్–2 నియామక ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను హైకోర్టు జూలై 14 వరకు పొడిగించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి మరో పది రోజుల గడువునిచ్చింది. తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రూప్–2 మెరిట్ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారని, నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన వి.రామచంద్రారెడ్డి, పి.శ్రీచరణదాస్ మరో 34 మంది వేర్వేరుగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. ఓఎంఆర్ షీట్‌లో రెండుసార్లు దిద్దరాదని (డబుల్ బబ్లింగ్), వైట్‌నర్ వాడరాదన్న నిబంధనను అతిక్రమించినందుకు టీఎస్‌పీఎస్సీ కొందరి జవాబుపత్రాల మూల్యాంకనం చేయకపోవడంతో పది మంది హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు ఏప్రిల్ 24న కొట్టేయడంతో వారంతా అనర్హులయ్యారు. అయినప్పటికీ వారి పేర్లు కూడా మెరిట్ జాబితాలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. టీఎస్‌పీఎస్సీ చర్య వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించలేదని కూడా పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై గత ఆదేశాల కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ కోరడంతో న్యాయమూర్తి అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను జూలై 4కి వాయిదా వేశారు.