కోటి కుటుంబాలకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ | High Speed Internet For One Crore Families | Sakshi
Sakshi News home page

కోటి కుటుంబాలకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌

Published Tue, Mar 13 2018 3:05 AM | Last Updated on Tue, Mar 13 2018 3:05 AM

High Speed Internet For One Crore Families - Sakshi

మహేశ్వరం : తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలో కోటి కుటుంబాలకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రక టించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మం డలం రావిర్యాల గ్రామంలోని ఫ్యాబ్‌సిటీ (ఈ–సిటీ)లో హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) స్థాపించనున్న ఆప్టికల్‌ ఫైబర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఆయన మాట్లాడుతూ.. టీ–ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ కింద మహేశ్వరంలోని మహేశ్వరం, మన్సాన్‌పల్లి, తుమ్మలూరు, సిరిగిరిపురం గ్రామాలకు అడ్వాన్స్‌ సిస్టమ్స్‌తో ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ఇప్పించామన్నారు. పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. మరిన్ని ఐటీ కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశంలో పేరుగాంచిన హెచ్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీ రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఫ్యాబ్‌సిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

20 ఎకరాల విస్తీర్ణంలో 2 దశల్లో రూ.1,100 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్న ప్లాంట్‌ ద్వారా 4వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలు, పరిశ్రమలు స్థాపించే వారికి భూమి, నీటి, విద్యుత్‌తో పాటు మౌలిక వసతులను తక్కువ కాలంలోనే కల్పించి అప్పగిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్లాంట్‌ ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ఆప్టికల్‌ ఫైబర్‌ను ఇండియాలో 4జీ, 5జీ, బ్రాడ్‌బ్యాండ్‌ ఎఫ్‌టీటీఎక్స్‌కు వినియోగించడం తోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీ చైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ శుక్లా, ఎండీ మహేంద్ర సహతా, ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ రంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భూ నిర్వాసితుల ముందస్తు అరెస్టు  
మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలను అడ్డుకుంటారనే సమాచారంతో రావిర్యాల, జెన్నాయిగూడ భూ నిర్వాసితులను ఆదిభట్ల పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement