హైదరాబాద్: హోలీ పండుగను పుర స్కరించుకుని అడిగినంత చందా ఇవ్వలేదని ఆగ్రహించిన హిజ్రాలు...ఓ దుకాణాన్ని ధ్వంసం చేయటంతోపాటు యజమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాం గేట్ మీనా హాస్పిటల్ ఎదురుగా మొబైల్ దుకాణం నడుపుతున్నారు. కొంత మంది హిజ్రాలు దుకాణం వద్దకు వచ్చి శ్రీనివాస్‌ను... హోలీ పండుగ చందా ఇవ్వాలని అడిగారు.
ఆయన రూ.50 ఇవ్వబోగా రూ.500 డిమాండ్ చేశారు. ఇవ్వలేనని అనడంతో ఆయనను కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కున్నారు. దుకాణంలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన తుకారాంగేట్ పోలీసులు..దౌర్జన్యానికి పాల్పడ్డ నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు.