
మంత్రి గారూ.. మీ ఊరి దవాఖానలో
ఈ కష్టాలు చూడండి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య నియోజకవర్గ కేంద్రంలోని పీహెచ్‌సీలో బుధవారం కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 86 డీపీఎల్, 6 వేసెక్టమీ మొత్తం 92 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే ఆస్పత్రిలో కేవలం 30 పడకలే ఉన్నాయి. శిబిరం కోసం ప్రత్యేకంగా మరో 30 పడకలు తెప్పించారు. ఆపరేషన్ చేయించుకున్నది 92 మంది కావడంతో పడకలు సరిపోలేదు. ఆపరేషన్ చేసిన వారిని బెడ్ వద్దకు తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్ ఒక్కటే ఉంది. అది కూడా సరిగా లేకపోవడంతో బెడ్‌లు దొరకవనే ఆత్రుతతో పలువురు మహిళలను వారి కుటుంబ సభ్యులు చేతులపై మోసుకుని తీసుకెళ్లారు.
చాలా మందికి నేలే దిక్కవడంతో నరకయాతన అనుభవించారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆపరేషన్ చేసుకున్న వారికి సెలైన్ బాటిల్ పెట్టడంలో ఆలస్యం కావడంతో బంధువులే బాటిల్ పెట్టడం కనిపించింది. సరైన ఏర్పాట్లు చేపట్టకుండా కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పా టు చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీహెచ్‌సీలో సౌకర్యాలను మెరుగుపర్చాలని, 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.