సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) దాదాపు పుష్కరకాలం తర్వాత ప్లాట్ల వేలానికి సిద్ధమైంది. 31 లే అవుట్లలోని 1,16,046 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 229 ప్లాట్ల ఈ–టెండర్, ఈ– వేలానికి సంబంధించిన బ్రోచర్‌ను అసెంబ్లీ ప్రాంగణంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమ వారం ఆవిష్కరించారు. అనంతరం ఆ వివరాలను బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ఎస్టేట్ అధికారి గంగాధర్‌తో కలసి హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు మీడియాకు తెలిపారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన 19 లేఅవుట్లలోని 141 ప్లాట్లు, హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్లలోని 88 గిఫ్ట్ డీడీ ప్లాట్ల అమ్మకాలకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. అమ్మకాల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ–టెండర్, ఈ–వేలానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ–టెండర్ కోట్ చేసిన వ్యక్తి ఈ–వేలంలో పాల్గొనే అవకాశముండదన్నారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఈ అమ్మకాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతా ల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న భూమి విలువ ధరకు ఒకటిన్నర నుంచి మూడున్నర రేట్లు ఎక్కువ ధరను నిర్ణయించినట్టు కమిషనర్ చిరంజీవి చెప్పారు. వేలం లో ఒకే బిడ్డరు పాల్గొంటే హెచ్‌ఎండీఏ ఆ వేలంను రద్దు చేసి తిరిగి రెండోసారి వేలం పాట నిర్వహిస్తుందని చెప్పారు. ఏ దశలో ఉన్నా వేలం పాటను రద్దు చేసే అధికారం హెచ్‌ఎండీఏ కలిగి ఉంటుందన్నారు. ఈ– వేలం, ఈ–టెండర్‌ను ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో ఉదయం 7 నుంచి 10 వరకు, 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ ప్లాట్లన్నింటికీ జియో ట్యాగింగ్ చేశామన్నారు.
రిజిస్ట్రేషన్.. వేలంలో పాల్గొనడం ఇలా..
ఈ వేలం పాటలో పాల్గొనాలనుకునేవారు https://www.mstcecommerce.com/ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఈ–టెండర్, ఈ–వేలం మొదలయ్యే ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల్లోపు రూ.10 వేలు చెల్లించాలి. ఈ–టెండర్, ఈ–వేలం జరిగే 10, 11, 12 తేదీల్లో తమకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో https:// www.mstcecommerce.com/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ టెండర్ కమ్ ఈ ఆక్షన్ అనే ఆప్షన్ కింద ఉన్న యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఈ టెండర్ లేదంటే ఈ–ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. హెచ్‌ఎండీఏ నిర్ధారించిన ధరలో 10 శాతం డబ్బును ఈఎండీ రూపంలో చెల్లించిన తర్వాతనే వేలంలో పాల్గొనాలి. ఇందులో సక్సెస్‌ఫుల్ బిడ్డర్ ప్లాట్ నిర్ధారిత ధరలో 25 శాతం డబ్బులు వారంలోపు చెల్లించాలి. మిగిలిన 75 శాతం డబ్బును 2 నెలల్లో హెచ్‌ఎండీఏకు చెల్లించాలి. కాని పక్షంలో ఇన్‌స్టాల్‌మెంట్ల వారీగా నిర్ధారిత వడ్డీతో చెల్లించాలి. బ్యాంకు ద్వారా ఋణ సౌకర్యం పొందేందుకు కొనుగోలుదారులకు అవసరమైన ప్రమాణ పత్రాన్ని కూడా హెచ్‌ఎండీఎ జారీ చేస్తుంది.
ఏయే ప్రాంతాల్లో...
హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన 19 లేఅవుట్లలో మిగిలి ఉన్న 80,556.36 చదరపు గజాల్లో ఉన్న 141 ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. అత్తాపూర్ రెసిడెన్షియల్ లేఅవుట్, అత్తాపూర్ ముష్క్ మహల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, చందానగర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, గోపన్‌పల్లి హుడా టౌన్‌షిప్, మాదాపూర్ సెక్టర్ –1, మాదాపూర్ సెక్టర్ – 3 , మైలార్ దేవ్‌పల్లి మధుబన్ రెసిడెన్షియల్ కాలనీ, మియాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, నల్లగండ్ల రెసిడెన్షియల్ కాంప్లెక్స్, నెక్నాంపూర్, సరూర్‌నగర్ చిత్ర లేఅవుట్, సరూర్‌నగర్ హుడా ఎంప్లాయీస్, సరూర్‌నగర్ రెసిడెన్షియల్, సరూర్‌నగర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్, షేక్‌పేట హుడా హైట్స్, హుడా ఎంక్లేవ్, జూబ్లీహిల్స్‌లోని నందగిరి లేఅవుట్, తెల్లాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, సాహెబ్‌నగర్ కలన్ (వనస్థలిపురం)లలో హెచ్‌ఎండీఏ ప్లాట్లు ఉన్నాయి. అయితే హెచ్‌ఎండీఏ అనుమతినిచ్చిన పోచారం, అంతారం, దూలపల్లి, మంకల్, మామిడిపల్లి, భువనగిరి, బాచుపల్లి, జాల్‌పల్లి, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్, అమీన్‌పూర్ గ్రామాల్లోని ప్రైవేట్ లేఅవుట్లలో 88 గిఫ్ట్ డీడీ ప్లాట్లు కూడా విక్రయానికి ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment