సాక్షి,సిటీబ్యూరో: ల్యాండ్ పూలింగ్‌తో నగర శివార్లను అభివృద్ధి పుంతలు తొక్కిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఇప్పుడు ఆ ఊసే మరిచినట్టుంది. ఉప్పల్ భగాయత్ లే అవుట్ల తరహాలోనే దుండిగల్‌లో 520 ఎకరాలు, బోడుప్పల్ మేడిపల్లిలో 116 ఎకరాల అసైన్డ్ భూములను అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మరోవైపు ప్రతాపసింగారంలో రైతులు 430 ఎకరాలు భూమిని హెచ్‌ఎండీఏకి అప్పగిస్తూ అంగీకార పత్రాన్ని ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఆ పనులు ఎంతదూరంలో ఉన్నాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓవైపు భూములు ఇచ్చి ఎదురుచూస్తున్న రైతులు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ పరిస్థితి ఏంటని అధికారులను కలుస్తున్నా సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ‘విధానపరమైన ప్రక్రియ’లో ఉందని చెబుతున్నా అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేదానిపైనా స్పష్టత లేదు. మినీ నగరం కోసం మా భూములు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినా అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘మేడిపల్లి’పై మౌనమేలనో!..
మేడిపల్లిలోని 116 ఎకరాల్లో లేఅవుట్ చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో హెచ్‌ఎండీఏ ఆ వైపు దృష్టి సారించింది. అంతలోనే 56 ఎకరాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన 60 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేద్దామనుకున్నా ఆగిపోయింది. దాదాపు 35 మంది రైతులు ఏళ్ల నుంచి సాగుచేసుకుంటున్న ఈ భూములపై యజమాన్య హక్కులు తమవేనని, హెచ్‌ఎండీఏ ఎకరానికి వెయ్యి గజాల భూమిని కేటాయించాలంటూ కోర్టుకెక్కారు. దీంతో హెచ్‌ఎండీఏ ఆదేశాల ప్రకారం ఆ భూములపై విచారణ చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ 35 మంది కబ్జాలో ఉన్నమాట వాస్తవమేనని, గతంలోనే వీరికి భూ యజమాన్య హక్కులు కల్పించాలని ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదని నివేదికను సమర్పించారు. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అలాగే, దుండిగల్‌లో 520 ఎకరాల అసైన్డ్ భూములను హెచ్‌ఎండీఏకు అప్పగించాలంటూ రెవెన్యూ విభాగానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం లేఖలు రాసి ఏడాది గడుస్తున్నా అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
రైతులు భూములిచ్చినా ఎదురుచూపులే
ప్రతాప సింగారంలో 430 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సముఖత వ్యక్తం చేస్తూ అంగీకార పత్రాన్ని హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులుకు ఇచ్చి ఏడాది మించిపోయింది. ‘ఈస్ట్‌లుక్’లో భాగంగా ఈ మెగా లే అవుట్ చేయడం వల్ల శివారు ప్రాంతాలు అభివృద్ధి పుంతలు తొక్కి మినీ నగరాలుగా మారుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.అయితే అందులో అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. ఇప్పటి దాకా కనీసం ఈ లేఅవుట్‌కు సంబంధించిన గుత్తేదారును ఎంపిక చేసేందుకు టెండర్లు కూడా పిలవలేదు. దీంలో ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ అని రైతులు వాపోతున్నారు. మహా అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్లు మారుతున్నా ల్యాండ్ పూలింగ్ పనుల్లో అడుగు ముందుకుపడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ దృష్టి సారించాలని కోరుతున్నారు.
మూడేళ్లలోపూర్తి చేయకుంటే పరిహారం
‘మాస్టర్ ప్లాన్ 2031’కు అనుగుణంగా సొంత నిధులతోనే అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ లే అవుట్లుగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, గ్రీనరీ తదితర సౌకర్యాలను కల్పించాలి. లేఅవుట్ పూర్తయ్యాక భూములు అప్పగించిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను నష్టపరిహరంగా అందజేస్తారు. రైతులు ఆ ప్లాట్లను అమ్ముకోవచ్చు.. లేదంటే సొంతానికి వినియోగించుకోవచ్చు. యజమానులకు కేటాయించగా మిగిలిన ప్లాట్లను హెచ్‌ఎండీఏ ఈ–వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలి. అయితే, 12 ఏళ్ల క్రితమే ఉప్పల్ భగాయత్‌లో ల్యాండ్ పూలింగ్‌కు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టినా ఆ భూమిపై వివాదాలు తలెత్తడంతో రెండేళ్ల క్రితం ప్లాట్ల పత్రాలు రైతులకు పంపిణీ చేశారు. ఆ అనుభవం దృష్ట్యా మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతినెలా ఆ భూమి మూలవిలువ(బేసిక్ వాల్యూ)పై 0.5 శాతం పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే హెచ్‌ఎండీఏ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, ప్రతాపసింగారం రైతులు 430 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడి ఏడాది గడస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment