
గులాబీ ‘భూమి’
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం.. ఇక్కడ భూమి హీన్ పథకం కింద 269 గ్రూపుల నుంచి దరఖాస్తులు డీసీసీబీకి అందాయి. ఐదుగురు ఒక్కో గ్రూపుగా ఏర్పడి ఈ దరఖాస్తులను ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 200 గ్రూపుల వరకు రుణాలు అందాయి. వీటిలో ఎక్కువగా స్థానిక గులాబీ శ్రేణులకే రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నారుు.. ఒక్క పీఏసీఎస్ పరిధిలోనే ఇలా ఉంటే మిగతా వాటిలో పరిస్థితి ఊహించవచ్చు.
- పథకంలో అనర్హులకే రుణాలు
- ఇప్పటికి జిల్లాలో రూ.50 కోట్లు పంపిణీ
- ఎక్కువగా అధికారపార్టీ శ్రేణులకు పంపకం
- మలి విడతలోనూ ఇలానే చేసేందుకు యత్నం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామాల్లో భూమి లేని పేదలకు రుణాలు ఇవ్వడమే ముఖ్యోద్దేశంగా భూమి హీన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కౌలు చేసుకునే రైతులు, రైతు కూలీలకు రూ.లక్ష వరకు ఆర్థికసహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. కానీ జిల్లాలో ఈ పథకం పక్కదారి పట్టింది. సొసైటీ చైర్మన్లు చాలా మంది అధికార పార్టీకి చెందినవారు కావడంతో వారి కనుసన్నల్లోనే అనర్హుల దరఖాస్తులు భారీగా డీసీసీబీకి వచ్చాయి. తమ అనుచర నేతలు, కార్యకర్తలకు సొసైటీల చైర్మన్లు ఈ రుణాలు అందేలా చక్రం తిప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో జిల్లాలో 99 సహకార సంఘాలున్నాయి.
వీటి పరిధిలో 10 వేల గ్రూపులకు రూ.100 కోట్లు రుణం ఇచ్చేలా డీసీసీబీ లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తులు కూడా సొసైటీ చైర్మన్ల కనుసన్నల్లోనే డీసీసీబీకి చేరాయి. గ్రామాల్లో అర్హులు ఉన్నా ఇందులో కొంతమందికే చోటు కల్పించారు. ఎక్కువగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల దరఖాస్తులను రుణ మంజూరు కోసం పంపించారు. డీసీసీబీ పెట్టుకున్న టార్గెట్‌లో ఇప్పటి వరకు రూ.50 కోట్లు 5 వేల గ్రూపులకు అందజేశారు. తాము అర్హులమైనా రుణం మంజూరు కాలేదని బాధిత రైతులు వాపోతున్నారు. టీఆర్‌ఎస్ నేతలు సొసైటీ చైర్మన్లుగా ఉన్న చోట తమ పార్టీ శ్రేణులకే రుణాలు ఇప్పించుకున్నట్లు సమాచారం.
మిగతా రుణంలోనూ వారికే..!
మరో రూ.50 కోట్లు ఈ పథకం కింద మంజూరు చేయాల్సి ఉంది. వీటిలో కూడా తమ అనుకున్న వారికే రుణాలు వస్తాయని అధికార పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్లు గ్రామాల్లో అనుంగు నేతలకు భరోసా ఇస్తున్నారు. నిబంధనల ప్రకారమే రుణ మంజూరు చేయిస్తామని చెప్పిన సొసైటీ బాధ్యుల మాటలు తొలి విడత పంపిణీ చేసిన రుణ మంజూరుతో తేలి పోవడంతో గ్రామాల్లో అర్హులైన వారు ఆందోళనన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మంజూరు చేసే రుణాలకు సంబంధించి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తేనే అర్హులకు దక్కే అవకాశం ఉంది.
కమీషన్ల దందా..
కొంత మంది సొసైటీ చైర్మన్లు ముందుగానే ఆయా గ్రూపులతో మాట్లాడుకొని ఇచ్చిన రుణంలో కొంత కమీషన్‌గా ఇవ్వాలని ఒప్పందాలు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఇలా ఒప్పందం చేసుకున్న గ్రూపుల దరఖాస్తులకే సొసైటీ చైర్మన్లు రుణ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలన్న నిబంధనలున్నా అనర్హులైన వారికి రుణాలు ఇప్పించడంలో చైర్మన్లు సఫలమైనట్లు తెలిసింది. రెండో విడత రుణ పంపిణీలోనూ ఈ రకమైన దందాకు అప్పుడే చైర్మన్లు తెరలేపడంతో తమకు రుణం మంజూరైందని అనర్హులైన గ్రూపు సభ్యులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అర్హులైన వారు బ్యాంకు అధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు.
అర్హులకే అందేలా చూస్తాం
భూమిహీన్ పథకం ఉద్దేశం భూమిలేని రైతులకు రుణం అందించడం. ప్రస్తుతం పంపిణీ చేసిన రుణంలో సొసైటీ చైర్మన్లు ఏ పార్టీ వారు ఉంటే ఆ పార్టీకి చెందిన వారికే లోన్‌లు వచ్చాయని కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనల ప్రకారం సొసైటీ చైర్మన్ల నుంచి వచ్చిన దరఖాస్తులకే ప్రాధాన్యత ఇచ్చాం. ఎలాంటి అవకతవకలకు చోటు లేదు. రెండో దశ రుణ పంపిణీ బాధ్యత అంతా పూర్తిగా బ్యాంకు తీసుకుంటుంది.
- నాగ చెన్నారావు, సీఈవో, డీసీసీబీ