
హోం సైన్స్‌తో ఉపాధి అవకాశాలు
- ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్‌కు అనూహ్య స్పందన
శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులే కాకుండా, త్వరగా ఉపాధిని, ఉద్యోగాన్ని అందించే విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సైఫాబాద్‌లోని హోం సైన్స్ కెరీర్స్ కాలేజ్ ప్రొఫెసర్ ఎస్.ఎల్. కామేశ్వరి తెలిపారు.
బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా టెన్త్, ఇంటర్ తర్వాత విద్యార్థులకు పలు రకాల కోర్సులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాక్షి కెరీర్ ఫెయిర్‌కు ఆదివారం అనూహ్య స్పందన లభించింది. ఫెయిర్‌లో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ ఎస్.ఎల్. కామేశ్వరి, వైఎస్సార్ నిథిమ్ డెరైక్టర్ నారాయణరెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రొ. కామేశ్వరి మాట్లాడుతూ.. హోం సైన్స్ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు పొందవచ్చునని, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చని సూచించారు. హోం సైన్స్‌లో ఉన్న పలు రకాల కోర్సులను వివరించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత హోటల్, టూరిజం రంగంలో మంచి అవకాశాలున్నాయని, దీనికి సంబంధించిన కోర్సులు చేయడం ఉత్తమమని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న వాటిపై అవగాహన విద్యార్థులకు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు ఆ దిశగా సాక్షి మీడియా కెరీర్ ఫెయిర్‌ను నిర్వహించటం అభినందనీయమన్నారు. సమావేశానికి హాజరైన పలువురు విద్యార్థుల అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫెయిర్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఏ రంగం ఎంచుకోవాలో..
కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఎలాంటి విద్యను అభ్యసించాలో తెలియదు. ఇక్కడికొచ్చాక యానిమేషన్, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న అవకాశాలు, ఇంటర్ తర్వాత ఏ కోర్సులు కెరీర్‌కి దోహదపడతాయో అర్థమయ్యింది.
- ఫాతిమా, ఇంటర్
సాక్షికి అభినందనలు..
ఇంటర్ తర్వాత ఏ కోర్సుల్లో చేరితే బాగుంటుందా తెలియక తికమకపడ్డా. ఇక్కడకు వచ్చిన పలువురు విద్యావంతుల ద్వారా కెరీర్‌లో స్థిరపడటానికి ఏ కోర్సులో చేరాలో తెలుసుకున్నా. ఇలాంటి కార్యక్రమం ద్వారా కెరీర్‌పై అవగాహన కల్పించినందుకు సాక్షికి అభినందనలు.
- శివాని, ఇంటర్