
విస్తరణపైనే ఆశలు
ఉత్కంఠలో ‘కొప్పుల’మంత్రా.. చీఫ్ విప్పా..
ఈశ్వర్ వర్గీయుల్లో టెన్షన్
కరీంనగర్ సిటీ : ఒకటి తను వద్దన్నాడు... మరొకటి పార్టీ ఇవ్వనంది.. అన్నట్లు తయారైంది ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పరిస్థితి. తనకు వస్తుందనుకున్న డెప్యూటీ సీఎం పదవిరాకపోగా, అధినేత ఆఫర్ చేసిన స్పీకర్ పదవి పట్ల ఆయన విముఖత చూ పారు. అయినప్పటికీ స్పీకర్, డెప్యూటీ స్పీకర్‌లలో ఏదో ఒక పదవి వస్తుంద నే అంతా భావించారు. చివరకు స్పీకర్‌గా మధుసూదనాచారి, డెప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో కొప్పులకు దక్కే పదవిపై మళ్లీ చర్చ మొదలైంది. తనకు ఏ ఇతర పదవులు వద్దని, మంత్రి పద వే కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చెప్పిన ఈశ్వర్, అందుకు అనుగుణంగా హామీ పొందినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. తనకు కచ్చితంగా మంత్రి పదవే వస్తుందనే భరోసాతో ఉన్న కొప్పుల, మంత్రివర్గ విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆయనకు కచ్చితంగా స్థానం లభిస్తుందనే భరోసాతో ఆయన వర్గీయులు ఉన్నారు.
వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే మంత్రి పదవి లభిస్తుందా, అంతే స్థాయిలో ఉన్న మరో పదవి వరిస్తుందా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఆయనకు కేబినెట్ ర్యాంకుతో సమానమైన చీఫ్ విప్ పదవి వస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వగా, కొప్పులకు చీఫ్ విప్ కట్టబెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. డెప్యూటీ సీఎం, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులకు కొప్పుల పేరు వినపడినా ఆ పదవులు దక్కకపోవడం, ప్రస్తుతం ఏ పదవి వస్తుందో అంచనా వేయలేకపోతుండడంతో ఈశ్వర్ వర్గీయుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈశ్వర్ మాత్రం మంత్రివర్గ విస్తర ణపైనే ఆశలు పెట్టుకున్నారు.