వేడెక్కుతున్న ‘కృష్ణా’ జలాలు! | Hot debates over krishna water issue | Sakshi
Sakshi News home page

వేడెక్కుతున్న ‘కృష్ణా’ జలాలు!

Published Mon, Dec 25 2017 1:52 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

Hot debates over krishna water issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ మళ్లీ వేడి పుట్టిస్తోంది. సమయానికి జరగని త్రిసభ్య కమిటీ భేటీలు, నీటి వినియోగంలో వ్యత్యాసాలు, టెలీమెట్రీ వ్యవస్థ అమల్లో జాప్యం, అవసరాలకు సరిపడాలేని లభ్యత జలాలు వెరసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాలను పెద్దవి చేసేలా ఉన్నాయి. దీనికితోడు చాలా వివాదాస్పద అంశాల్లో పట్టనట్టుగా ఉన్న కృష్ణా బోర్డు వ్యవహారం రాష్ట్రాల మధ్య వివాదాన్ని పెంచుతున్నాయి. కృష్ణాబేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన 163.89 టీఎంసీల లభ్యత జలాలున్నాయి.

ఇరు రాష్ట్రాలు సమర్పించిన ఇండెంట్‌ల మేరకు జనవరి నుంచి మే చివరి వరకు మొత్తంగా 206.40 టీఎంసీల మేర అవసరాలున్నాయి. ఇందులో తెలంగాణ అవసరాలు 101.12 టీఎంసీల మేర ఉండగా, ఏపీకి 105.28 టీఎంసీల అవసరాలున్నాయి. లభ్యత జలాలకు మించి అవసరాలు ఉండటంతో వీటిని ఎలా పంచాలన్నది ప్రస్తుతం కృష్ణా బోర్డు ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పటికే బోర్డు త్రిసభ్య కమిటీ వాయిదాపడుతూ వస్తుండటంతో ఇరు రాష్ట్రాలు తమకు దక్కే 66:34 నిష్పత్తిన నీటిని వాడుకుంటూ పోతున్నాయి. అయితే ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుందన్నది త్రిసభ్య కమిటీ భేటీ జరిగితేగానీ స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఇక సాగర్‌ ఎడమ కాల్వకింద ప్రతిసారీ నీటి కేటాయింపులు, వినియోగానికి మధ్య వ్యత్యాసం ఏర్పడుతోంది. బోర్డు 5 టీఎంసీలు కేటాయిస్తే అది ఏపీ పరిధిలోని ఆయకట్టుకు చేరేసరికి 2 టీఎంసీలుగా కూడా ఉండట్లేదని ఇప్పటికే ఏపీ పలుమార్లు బోర్డు దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవ నష్టాలు ఎలా ఉంటాయన్నది తేల్చేందుకు కృష్ణా బోర్డు గత నెలలో కమిటీ వేసినా అది ఇంతవరకు ఏమీ తేల్చలేదు. దీనికి తోడు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసిన నీటిలో లెక్కతేలని జలాల అంశం ఇప్పటికీ వివాదంగానే ఉంది.  

ఇప్పటికీ అమల్లోకిరాని టెలీమెట్రీ: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు నిర్ధారించిన ప్రాంతాల్లో రెండు విడతల్లో టెలీమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని 2016 జూన్‌లో నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌ నాటికే వీటిని సిద్ధం చేస్తామని బోర్డు హామీ ఇచ్చినా అది అమల్లోకి రాలేదు. దీంతో పోతిరెడ్డిపాడు కింద వినియోగంపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై ఇటీవలే బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఘాటు లేఖ రాసింది. ఇప్పటికైనా మరింత జాప్యం జరగకుండా బోర్డు తక్షణమే కార్యాచరణలోకి తీసుకోవాలని కోరినా స్పందన కరువైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement