
మహానగరానికి తక్కువ ఖర్చుతో.. తక్కువ వ్యవధిలో ఇల్లు కట్టుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనిని జీహెచ్‌ఎంసీ ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తోంది. ఇందులో ఇటుకలతో పనిలేకుండా టన్నెల్ ఫామ్ టెక్నాలజీని వినియోగించి షియర్ వాల్స్‌తో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. గ్రేటర్‌లో ఏడాది వ్యవధిలో లక్ష ఇళ్లను నిర్మించాలి. త్వరగా ఈ పనులు పూర్తి చేయాలంటే ఈ టెక్నాలజీని వినియోగిస్తామన్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడంతో షియర్‌వాల్ పనులు మొదలయ్యాయి. కీసర మండలం రాంపల్లిలో 6,264 ఇళ్లను ఇలా ఇటుకల్లేకుండా నిర్మించే పనులు వడివడిగా సాగుతున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ వ్యవధితో ఎక్కువ ఇళ్లను నిర్మించేందుకుగాను జీహెచ్‌ఎంసీ టన్నెల్‌ఫామ్ టెక్నాలజీని వినియోగిస్తోంది. షియర్‌వాల్స్‌తో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే కీసర మండలం రాంపల్లిలో 6,264 ఇళ్లను ఇలా ఇటుకల్లేకుండా నిర్మిచే పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ విధానంలో గోడలను కట్టేందుకు ఇటుకలు పేర్చకుండా శ్లాబ్ నిర్మాణం తరహాలో కాంక్రీటుతోనే గోడల్ని నిర్మిస్తారు. ఇందుకు గోడల కోసం అవసరమైన సైజులో ప్రత్యేక స్టీల్‌ప్లేట్లను వినియోగిస్తారు. రెండు స్టీల్ ప్లేట్ల మధ్య కాంక్రీటు నింపి గట్టిపడ్డాక స్టీల్ ప్లేట్లు తొలగిస్తారు. దీంతో కాంక్రీటు గోడ రెడీ అవుతుంది. గోడలు, శ్లాబ్ ఏకకాలంలో నిర్మించవచ్చు. ఈ పద్ధతి వల్ల 48 గంటల్లోనే ఒక అంతస్తును నిర్మించవచ్చని రాంపల్లిలో ఇళ్ల పనులు పర్యవేక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటదాస్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధానం వల్ల ఇటుకల అవసరం లేకపోవడంతో పాటు కూలీలు కూడా తక్కువ మంది సరిపోతారు.
నిర్మాణ వివరాలు ఇవీ..
రాంపల్లిలో 41 ఎకరాల్లో 6,264 ఇళ్లు మంజూరయ్యాయి. స్టిల్ట్ + 10 అంతస్తులుగా వీటిని నిర్మిస్తున్నారు.
మొత్తం బ్లాకులు: 52
ఒక్కో బ్లాక్‌లో ఇళ్లు: 120
ఒక్కో ఇంటి వ్యయం: రూ.8.65 లక్షలు (రూ.75 వేలు మౌలిక సదుపాయాలకు)
మొత్తం ప్రాజెక్ట్ వ్యయం: రూ. 541.83 కోట్లు
ప్రస్తుతం 15 బ్లాకుల్లో పనులు నడుస్తున్నాయి. కొల్లూరులో నిర్మించనున్న 15,660 ఇళ్లలోనూ దాదాపు సగం ఇళ్లు షియర్‌వాల్స్‌తోనే చేపట్టారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు, పార్కులు, ప్లేగ్రౌండ్, భూగర్భ డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ మతాల ప్రార్థన కేంద్రాలను కూడా నిర్మించనుండడంతో అది టౌన్‌షిప్‌గా మారనుంది. కొల్లూరుతో పాటు అహ్మద్‌గూడలో 4,428 ఇళ్లు, మునగనూరులో 2,700, ఫిర్జాదిగూడలో 2,200, భోజగుట్టలో 1,824, జియాగూడలో 840 ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ కన్న సురేష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment