‘రైతుబంధు’ బావుందా..? | How is the RYTHU BANDHU | Sakshi
Sakshi News home page

‘రైతుబంధు’ బావుందా..?

Published Wed, May 30 2018 1:42 PM | Last Updated on Wed, May 30 2018 1:42 PM

How is the RYTHU BANDHU - Sakshi

 అమ్మపాలెంలో రైతుబంధు రికార్డులను పరిశీలిస్తున్న నీతూ ప్రసాద్, కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ 

కొణిజర్ల : ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎలా ఉంది.. రైతులందరికీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చాయా.. పెట్టుబడి చెక్కులు బ్యాంకు నుంచి మార్చుకున్నారా.. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు..’

అంటూ రైతుబంధు పథకం జిల్లా ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం తీరుతెన్నులను మండలంలోని అమ్మపాలెం గ్రామంలో మంగళవారం ఆమె పరిశీలించారు.

గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఎన్ని పట్టాలు.. చెక్కులు ఎన్ని ఇచ్చారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి చెక్కులు ఇవ్వనట్లుగా రికార్డుల్లో నమోదు చేయగా..

దానిపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ రైతుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడారు.

గ్రామంలో అసైన్డ్‌ భూమి కొనుగోలు చేసి అనుభవదారులుగా ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వకూడదని నిర్ణయించామని కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ భూములను అలాగే ఉంచామన్నారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఆమె ఉపాధిహామీ పథకం గురించి రైతులకు వివరించారు.

పొలాల్లో నీటి గుంటలు తీసుకోవాలని, పాడైపోయిన బోర్లు బాగు చేయించుకోవడానికి ఈజీఎస్‌లో రూ.20వేల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధిహామీ పథకం కింద బావి పూడిక కూడా తీయించుకోవచ్చన్నారు.

అయితే దీని గురించి ఈజీఎస్‌ సిబ్బంది తమకు చెప్పలేదని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్న వారికి షెడ్ల నిర్మాణానికి రూ.55వేలు ఇస్తామన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామన్నారు.

మూడున్నర ఎకరాల గ్రామకంఠం భూమి గ్రామంలో ఉందని, దానిని శ్మశాన వాటిక కోసం కేటాయించాలని స్థానికులు కోరగా.. పరిశీలిస్తానని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ టి.పూర్ణచంద్ర, డీపీఓ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీఓ ఇందుమతి, తహసీల్దార్‌ ఎం.శైలజ, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, సర్పంచ్‌ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యుడు సోమ్లా, ఈఓపీఆర్‌డీ కె.జమలారెడ్డి, ఏఓ టి.అరుణజ్యోతి, ఏపీఓ సరిత, ఆర్‌ఐ కొండలరావు, వీఆర్‌ఓ ఎస్‌.రామారావు, ఏఈఓ జగదీష్‌ పాల్గొన్నారు.  

‘పెట్టుబడి’కే వినియోగించాలి.. 

చింతకాని : రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సాయాన్ని ఇతర ఖర్చులకు కాకుండా వ్యవసాయానికే వినియోగించుకోవాలని నీతూ ప్రసాద్‌ తెలిపారు. చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో రైతుబంధు పథకం అమలు తీరును పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఫొటోలు, పేర్లు, విస్తీర్ణాలు, ఆధార్‌ నంబర్లు, కులం పేర్లు తప్పుగా నమోదయ్యాయని కొంతమంది  రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.

తమకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని మరికొందరు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని, ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.  పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను వెంటనే సరిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి పనులపై ఆరా తీశారు.

పనిచేసినా వేతనాలు రావటం లేదని కొంతమంది కూలీలు తెలిపారు. వేతనాలు రాని కూలీల వివరాలను పంపిస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఇందుమతి, స్థానిక తహసీల్దార్‌ కారుమంచి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎండీ నవాబ్‌పాషా, ఏఓ కాసర అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement