మేమున్నామని.. మీకేంకాదని.. | How To Use Hawk Eye App In Telugu | Sakshi
Sakshi News home page

మేమున్నామని.. మీకేంకాదని..

Published Wed, Dec 11 2019 8:00 AM | Last Updated on Wed, Dec 11 2019 8:00 AM

How To Use Hawk Eye App In Telugu - Sakshi

సాక్షి, మంచిర్యాల : హైదరాబాద్‌లో దిశ, హన్మకొండలో మానస, ఆసిఫాబాద్‌లో జిల్లాలో సమతలు మానవ మృగాల చేతుల్లో బలైన సంఘటనలు సంచలనం సృష్టించాయి. ప్రజల భద్రత కోసం పోలీస్‌ శాఖ ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చింది. ఆపద పొంచి ఉన్నప్పుడు, ఆటోలో, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు 100 డయల్, హాక్‌–ఐ, షీ టీంలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయి. వీటి గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై  ప్రత్యేక కథనం..

నేర రహిత తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇప్పటికే నేర నియంత్రణలో శర వేగంగా దూసుకుపోతోంది. హాక్‌–ఐ, 100 డయల్‌ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. పోలీస్‌ అధికారులు హాక్‌–ఐ, 100 డయల్‌ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన రాలేదు. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో ప్రజలకు దగ్గరవుతూ నేరరహిత సమాజం వైపు అడుగులు వేస్తున్నారు తెలంగాణ పోలీసులు. హాక్‌–ఐ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. అత్యవసర సమయాల్లో పోలీస్‌ సహాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన పర్చువల్‌ బటన్‌ ‘ఎస్‌వోఎస్‌’ ప్రెస్‌ చేస్తే చాలు పోలీసులు స్పందిస్తారు. ఈ బటన్‌ ద్వారా లొకేషన్‌ తెలుసుకునే సౌకర్యం కూడా ఉండడంతో బాధితుల ఆచూకీ గుర్తించి, ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంది. ఈ తరహాలో ఇప్పటి వరకు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో సుమారు 20 కాల్స్‌కు పోలీసులు స్పందించారు. 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగించే వారు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఐవోఎస్‌ ద్వారా హాక్‌–ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌ని ఓపెన్‌ చేయగానే రిపోర్ట్‌ స్టేషన్‌ టూ పోలీస్, ఉమెన్‌ ట్రావెల్‌ మూడ్‌ సేఫ్, రిజిష్టర్‌ డీటెయిల్స్‌ ఆఫ్‌ సర్వెంట్, వర్కర్, టెనెంట్, ఎస్‌వోఎస్, ఎమ్మర్జెన్సీ పోలీస్‌ కాంటాక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్‌ అని స్క్రీన్‌ మీద కనిపిస్తాయి. వివిధ ఆప్షన్‌లు వస్తాయి. 
► ఆప్షన్‌–1లో మూడు కేటగిరీలు ఉంటాయి.  ఇందులో సెలెక్ట్‌ కేటగిరిలో ట్రాఫిక్, జరిగిన నేరం మహిళలపై జరుగుతున్న వేధింపులు, పోలీసులు చేసే ఉల్లంఘనలు, ఉత్తమ పోలీసింగ్‌ సలహాలు తీసుకోవడానికి ఆప్షన్లు పొందుపరిచారు.
► ఆప్షన్‌–2లో ఫొటో లేదా వీడియో సేవ్‌ సదుపాయం, ప్లేస్‌ ఆప్‌ బోర్డింగ్‌ అని ఉంటుంది. బాధితులు ఎక్కడ ఉన్నారో టైప్‌ చేయాలి, ఇది పూర్తిగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆప్షన్‌.
► ఆప్షన్‌–3లో ఇంట్లో అద్దెకు దిగిన వారు, పని మనుషులు, ఎలక్ట్రికల్‌ బోర్డ్‌ రిపేర్లు చేసే వారి సమాచారాన్ని సేకరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. 
► ఆప్షన్‌–4, ఎస్‌వోఎస్‌ అంటే సేవ్‌ అవర్‌ సెల్ఫ్‌ ఇది కూడా మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. 
► ఆప్షన్‌–5, ఇందులో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పోలీస్‌స్టేషన్ల నంబర్లతో పాటు వివిధ పోలీసు అధికారుల నంబర్లు పొందుపరిచారు. 
► ఆప్షన్‌–6,  కమ్యూనిటీ పోలీసింగ్‌లో చేరాలనుకునే వారి కోసం ఈ ఆప్షన్‌ తయారు చేశారు. పేరు మొబైల్‌ నంబర్, ఈ మెయిల్‌ ఐడీ, చిరునామా పొందు పరిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌ పేరు నమోదు చేయాలి.
► ఆప్షన్‌–7, వివిద ఆప్షన్ల ద్వారా పోలీసులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఉండే ఆప్షన్‌ ఇది.
►  ఆప్షన్‌–8, ఈ ఆప్షన్‌లో యాప్‌లో రిజిష్టర్‌ అయిన తర్వాత మళ్లీ ఏదైనా మార్పులు చేసుకునే విధంగా ఉపయోగ పడుతోంది.

ఆపన్నహస్తం..
రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హాక్‌–ఐ యాప్‌ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 50వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దిశ ఘటనకు ముందు కమిషనరేట్‌ పరిధిలో 20వేల మంది యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. దిశ ఘటన అనంతరం 13రోజుల వ్యవధిలో 30వేల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు మొదలు కొని ఇతర నేరాల వరకు ఉన్న చోట నుంచి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడు పోలీసుల నుంచి సహాయం సైతం పొందేందుకు ఉపయుక్తంగా ఉండేలా డిజైన్‌ చేశారు. పోలీసింగ్‌ను మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలు సూచనలను సైతం ప్రజలు ఈ యాప్‌ ద్వారా చేసే అవకాశం ఉంది.

తక్షణ సహాయం కోసం..
హాక్‌–ఐలో ఉన్న వివిధ ఆప్షన్స్‌లో ఎస్‌వోఎస్‌ కీలకమైనది. అత్యవసర సమయంలో ఫోన్‌ చేసి పూర్తిస్థాయి సందేశం పంపేందుకు అవకాశం లేనప్పుడు మీటా నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే పర్చువల్‌ ఎమ్మర్జెన్సీ బటన్‌ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్‌ నంబర్‌ వంటివి ఎంటర్‌ చేయాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరుచాలి. గరిష్టంగా 5గురికి చెందిన సెల్‌ ఫోన్‌ నంబర్లు ఎంటర్‌ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎమ్మర్జెన్సీ బటన్‌ యాక్టివేట్‌ అయినట్లే, అత్యవసన సమయాల్లో ఈ బటన్‌ నొక్కితే సరిపోయేలా యాప్‌ డిజైన్‌ చేశారు. 

ఎక్కడున్నా సరే...
జీపీఎస్‌ పరిజ్ఞానంతో అనుసంధానమై ఉన్న యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. బటన్‌ నొక్కిన వెంటనే వీటిపై మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది హాక్‌–ఐ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్‌ వస్తుంది. ఎస్‌వోఎస్‌ నొక్కిన తర్వాత బాధితుడు ఎటూ వెళ్లినా కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై వివరాలు కనిపిస్తాయి. 

ముందుగా సంప్రదించేందుకు ప్రయత్నిస్తారు..
హాక్‌–ఐ ఎస్‌వోఎస్‌ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ప్రాథమికంగా బాధితులు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తారు. ఆపై ఫోన్‌ చేయడం, పూర్తి సందేశం పంపడం ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. గరిష్టంగా 2 నిమిషాలు వేచి చూసి ఈ రెండింటికి బాధితుల నుంచి స్పందన రాని పక్షంలో బాధితులు ఇబ్బందుల్లో ఉన్నట్లు నిర్ధారిస్తారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న రక్షక్, బ్లూకోట్స్‌ సిబ్బందిని బాధితులు ఉన్న ప్రదేశానికి పంపిస్తారు.

క్యాబ్‌ ప్రయాణంలో..
మహిళలు ట్యాక్సీ, ఆటోల్లో ప్రయాణం చేస్తూ వాహనం నంబర్, వాహన వీడియో లేదా ఫొటో తీయాలి. వాహనం నంబర్‌ వెళ్తున్న ప్రదేశం, వెళ్లాల్సిన ప్రదేశం యాప్‌ ద్వారా పంపించాలి. దీంతో ప్రయాణం చేస్తున్న వాహనం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది.

డయల్‌100..
నేరాల నియంత్రణకు సత్వర సమాచారం కోసం రాష్ట్ర పోలీస్‌ శాఖ డయల్‌ 100 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే సకాలంలో స్పందించి సేవలందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. 24 గంటలు ఇది పనిచేస్తుంది. విడతల వారీగా పోలీస్‌ సిబ్బంది వచ్చిన కాల్స్‌ను నమోదు చేసుకొని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందజేస్తారు. 

టోల్‌ ఫ్రీ నంబర్లు..
దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి టోల్‌ ఫ్రీ నంబర్లను తెచ్చింది. 112, 1090, 1091 నంబర్లు సైతం వినియోగంలో ఉన్నాయి. వీటికి ఫోన్‌ చేసి పోలీస్‌ల నుంచి సహాయం పొందవచ్చు. 

షీ టీమ్‌ ఫిర్యాదులకు ప్రత్యేక నంబర్‌..
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్‌ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్‌ పోలీసుల సహాయం కోసం 181 లేదా వాట్సాప్‌ నంబర్‌ 6303923700 మెసేజ్‌ చేసినా బాధితులకు తక్షణమే సహాయం అందుతోంది.

సాంకేతికతతోనే నేరాల నియంత్రణ
హాక్‌–ఐ, 100 డయల్‌ చేయడం ద్వారా నేరాల నియంత్రణ అత్యంత త్వరలోనే సాధ్యమవుతుంది. వీటి ద్వారా పోలీసులు సత్వరమే స్పందిస్తారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఆపద పొంచి ఉన్నట్లు అనిపిస్తే వెంటనే 100 డయల్‌ చేయండి. ట్యాక్సిలో ప్రయాణిస్తున్న వారికి హాక్‌ –ఐ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. 
– వి. సత్యనారాయణ, పోలీస్‌ కమిషనర్, రామగుండం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement