సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతే వేగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని నిబంధనలను లెక్కచేయడంలేదు. అతివేగం నియంత్రణకు పోలీసులు ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నా ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఒకవైపు జరిమానా చెల్లిస్తూనే మరోవైపు ‘నో రూల్స్’ అంటూ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాపిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నా అవకాశం దొరికితే చాలు రూల్స్ అతిక్రమిస్తున్నారు. తమను ఎవరూ చూడడం లేదని అనుకుంటూన్నారు. కానీ నిఘా నేత్రాలు ఉల్లంఘనలను కెమెరాల్లో బంధిస్తున్నాయి. దీంతో ప్రతినెలా జరిమానా వీపరితీంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 8 నెలల్లోనే రూ.10,27,09,200 జరిమాన వసూలవడమే ఇందుకు నిదర్శనం.
కేసుల రకాలు | కేసులు | జరిమానాలు(రూ.) |
రాంగ్‌రూట్ డ్రైవింగ్/ జిగ్‌జాగ్ డ్రైవింగ్ | 29,142 | 89,48,200 |
ఒవర్‌లోడు కేసులు | 23 | 10,800 |
సెల్‌ఫొన్ డ్రైవింగ్ కేసులు | 650 | 6,50,000 |
మైనర్ డ్రైవింగ్ కేసులు | 128 | 64,300 |
ట్రిపుల్ రైడింగ్ కేసులు | 2,340 | 2,88,000 |
నంబర్‌ప్లేట్ మార్పు కేసులు | 1,326 | 3,17,900 |
ఈ చలాన్‌తో జరిమానాల వేగం...
రాష్ట్ర వ్యాప్తంగా పలు దశల్లో ఈచలాన్లు అమలు చేశారు. మొదట హైదారాబాద్‌లో అమలు చేయగా అక్కడ విజయవంతం కావడంతో 2018, డిసెంబర్ 23 నుంచి కరీంనగర్‌లో ఈ చలాన్ విధానం ప్రారంభించారు. గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని అక్కడిక్కడే పట్టుకుని జరిమానా నేరుగా వసూలు చేసేవారు. దీనితో ఇటు వాహనాదారులు, అటు పోలీసులు కూడా ఇబ్బంది పడేవారు. కొన్నిసార్లు వాహనదారుడి వద్ద నగదు లేకపోవడంతో వాహనాన్ని పట్టుకుని రావడం, వాటిని భద్రపరచడం పోలీసులు తలకుమించి భారంగా మారేది. జరిమానాల విషయంలో కూడా పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీటన్నంటికీ చెక్ పెడుతూ ఈ చలాన్ అమలు చేయడం ప్రారంభించారు. ఈపద్ధతితో అక్కడిక్కడే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, వాహనాలను వాహనాదారులు తీసుకుని వెళ్లడం చేయడం వల్ల వాహనాదారులు వీలు చూసుకుని ఆన్‌లైన్‌లో జరిమానాలు చెల్లిస్తున్నారు.
ఉల్లంఘనలే.. ఉల్లంఘనలు..
కరీంనగర్‌లో ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘనలు వీపరితంగా పెరిగిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ , జిగ్‌జాగ్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ చలాన్ పద్ధతి అమలు చేసిన నాటి నుంచి 2019, జులై 31 వరకు 29,142 కేసులు నమోదు కాగా జరిమానాల రూపంలో భారీగా రూ.89.49 లక్షల జరిమానాల చెల్లించారు. తర్వాత స్థానం ట్రిపుల్ రైడింగ్ కేసులు ఉన్నాయి. ఇవి 2,340 కేసులు నమోదు కాగా రూ.28.08 లక్షల జరిమానా చెల్లించారు. హెల్మెట్ లేకుండా నమోదు అవుతున్నా కేసులు కూడా అధికంగా ఉంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.
సరాసరి రోజుకు సుమారు 150 వరకూ నో హెల్మెట్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు పరిధిలో 2018 డిసెంబర్ నుంచి 2019 జులై వరకూ 2,104 కేసులు నమోదు కాగా వీటిలో 966 జరిమానాలు విధించారు. 1,085 మందికి జైలు శిక్ష అమలు చేశారు. వీటిని బట్టి వాహనాలు ఇష్టారాజ్యంగా నడుపుతూ జరిమానాలు చెల్లించడానికి ఇబ్బందులు పడడం లేదని తెలుస్తోంది. నిబంధనలు ఎలా ఉన్నా జరిమానాలు చెల్లిసున్నాం కదా అన్న ధోరణి పెరిగిపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
పెరిగిన మైనర్ డ్రైవింగ్..
హైదారాబాద్ తర్వాత అత్యధిక మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు అవుతోంది కూడా కరీంనగర్‌లోనే. హైస్కూల్ స్థాయిలో వాహనాలు నడుపు తూ పోలీసులకు చిక్కుతున్నారు. దీనికి పోలీసు లు కేసులు నమోదు చేస్తే వారి భవిష్యత్ నాశమ వుతుందనే వదిలేస్తున్నారు. అయితే ఇదే అలుసుగా వాహనాలపై మైనర్లు దూసుకుపోతు న్నా రు. నగరంలో మైనర్లు అధిక వేగంతో దూసు కుని పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
నగరంలో చాలా మంది ట్రాపిక్ నియమాలను పాటించకుండా వెళ్తున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్లడం, రాంగ్‌రూట్‌లో వెళ్లడం, నో పార్కింగ్ ప్రాంతాలు వాహనాలు నిలపడం చెస్తున్నారు. ఇలాంటి ఘటనలను ట్రాపిక్ పోలీసులు కెమోరాల్లో బంధించి వాహనాల నంబర్ ప్లేట్లు కనిపించేలా ఫొటోలు తీస్తున్నారు. తర్వాత వాటిని ఈ చలాన్‌కు జతపరుస్తారు. వారం రోజుల వ్యవధిలోనే ఉల్లంఘించిన ట్రాపిక్ నియమ నిబంధనలు పేర్కొంటూ ఇంటికి రశీదు పంపతున్నారు. నెల రోజులోపు జరిమానా చెల్లించకుంటే వాహనం పట్టుబడినప్పుడు సీజ్ చేస్తున్నారు. అనంతరం జరిమానాలు చెల్లించి వాహనాన్ని తీసుకుని వెళ్లాలి.
నిబంధనలు పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించడంతోపాటు ఎలాంటి జరిమానాలు లేకుండా సాఫిగా వెళ్లొచ్చు. ఇతరులకు కూడా ఇబ్బంది లేకుండా భద్రంగా ఇంటికి చేరుకోవచ్చు. వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. నిబంధనలు పాటించని వాహనాదారుల, ట్రాపిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తాం.
– తిరుమల్, ఇన్‌స్పెక్టర్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment