మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు నుంచి 60 నుంచి 70 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లా పాకాల వరకు తీసుకు వెళ్లేందుకు ఉద్దేశించిన జూరాల-పాకాల ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి 124 కిలోమీటర్ల భారీ జంట టన్నెల్‌లను నిర్మించాల్సి ఉంటుందని
జూరాల-పాకాల ప్రాజెక్టుకు భారీ టన్నెల్
Published Mon, Oct 20 2014 1:18 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
124 కిలోమీటర్ల భారీ టన్నెల్
నివేదికలో ప్రతిపాదించిన వ్యాప్‌కో సంస్థ
జూరాల ప్రాజెక్ట్, మహబూబ్ నగర్, భారీ టన్నెల్
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు నుంచి 60 నుంచి 70 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లా పాకాల వరకు తీసుకు వెళ్లేందుకు ఉద్దేశించిన జూరాల-పాకాల ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి 124 కిలోమీటర్ల భారీ జంట టన్నెల్‌లను నిర్మించాల్సి ఉంటుందని సంబంధిత సర్వే సంస్థ ‘వ్యాప్‌కో’ స్పష్టం చేసింది. కొద్దికాలమే వరద ఉంటున్నందున పెద్దఎత్తున నీటిని కాల్వద్వారా తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అంతేకాక కాల్వ నిర్మాణానికి భారీగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని, దీంతో ఇప్పటికే సాగవుతున్న ఆయకట్టు దెబ్బతినడంతోపాటు, ధనవ్యయం ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. జూరాలలో వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లా పాకాల వరకు మధ్యలో చిన్ని నీటివనరులను నింపుతూ, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం దీనిని చేపడుతున్నారు. సమగ్ర నివేదిక తయారీ బాధ్యతలను వ్యాప్‌కోకు కట్టబెట్టారు. ఈ సంస్థ ఇప్పటికే 50 శాతం సర్వే పనులను పూర్తిచేసి, ఇటీవలే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. తుదిసర్వేను డిసెంబర్ మూడో వారానికి పూర్తిచేసి సర్కార్‌కు సమగ్ర నివేదిక అందజేయనుంది. జూరాల నుంచి 4 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్ తర్వాత 124 కిలోమీటర్ల భారీటన్నెల్‌ను సంస్థ ప్రతిపాదించింది.
కెనాల్‌తో భారీ వ్యయం: జూరాల కన్నా పాకాల ఎత్తున ఉండడంతో నీటిని 310 మీటర్ల ఎత్తునుంచి నాలుగైదువందల మీటర్ల ఎత్తువరకు తరలించాల్సి ఉంటుంది. ఇది కెనాల్ ద్వారా సాధ్యం కాదని సంస్థ తేల్చింది. జూరాలలో వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించాలంటే 12 వేల క్యూసెక్కుల నీటిని ప్రతిరోజూ తరలించాలి. ఇందుకు వెడల్పు ఎక్కువగా ఉండే కెనాల్ అవసరం. కెనాల్‌ల తవ్వకం జరిపితే ఎత్తుకుపోయే కొలది గరిష్టంగా 100 మీటర్లలోతు వరకు తవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా కెనాల్ లోతు 50 మీటర్లకు మించి చేపట్టలేరు. అదీగాక కాల్వ నిర్మాణం చేపడితే దానికి కొత్తగా దారులు, డ్రెయిన్‌లు నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరికొంతభూమి సేకరించాల్సి ఉంటుంది.
వరదకాల్వ పూర్తిగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఆయకట్టు గుండా పోనుండడంతో అది దెబ్బతినే అవకాశం ఉంది. భూసేకరణ, కాల్వల నిర్మాణం ఖర్చుకూడా తడిసి మోపెడవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సంస్థ టన్నెల్ నిర్మాణానికి మొగ్గుచూపింది. అయితే ఒక టన్నెల్ ద్వారా 12 వేల క్యూసెక్కుల నీటిని తరలించడం సాధ్యం కానందున రెండుటన్నెల్‌ల ఏర్పాటు తప్పనిసరని చెబుతోంది. ఇవి జూరాల ఎగువన నాలుగు కిలోమీటర్ల నుంచి నల్లగొండ జిల్లా డిండి వరకు ఉండే అవకాశం ఉంది.
15 వరకు రిజర్వాయర్‌లు: ప్రాజెక్టు పరిధిలో 15 వరకు రిజర్వాయర్ల అవసరం ఉందని సంస్థ నిర్ధారించినట్టు తెలిసింది. డిండి తర్వాత ఈ రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి ఐదారు రిజర్వాయర్లకు స్థలాలను గుర్తించినట్టు తెలిసింది.
Advertisement
Advertisement