* నీటిని వదిలేసి చెత్తను తొలగించాలని టీ సర్కార్ నిర్ణయం
* యుద్ధప్రాతిపదికన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు
* మురుగునీరు చేరకుండా మళ్లింపు కాలువలు
* వీటి నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయింపు
* సాగర్ చుట్టూ 40 చోట్ల ఆకాశ హర్మ్యాలు
* పనుల పర్యవేక్షణకు కార్యదర్శుల ఉపసంఘం ఏర్పాటు
* ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజధానిలోని హుస్సేన్‌సాగర్ వచ్చే వేసవిలో ఖాళీ కానుంది. నీళ్లులేని సాగర్ కనిపించనుంది. దీనిలోని నీటిని విడుదల చేసేసి.. మలినాలను, చెత్తా చెదారాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కా ర్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, సాగర్ చుట్టూ 40 ప్రాంతాల్లో 100 ఎకరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శనివారం సీఎస్ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. సాగర్‌లోకి మురుగు నీరు చేరకుండా మళ్లింపు కాలువలు నిర్మించాలని సూచించారు. దీనికి రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. గణేశ్, అమ్మవారి విగ్రహాల నిమజ్జనం కారణంగా సాగర్ కలుషితమవుతున్న దృష్ట్యా ఇందిరాపార్క్‌లో వినాయక్ సాగర్ పేరుతో చెరువు నిర్మించి అక్కడే నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ వేసవిలోనే సాగర్‌ను ఖాళీ చేసి మలినాలను తొలగించే పనుల పర్యవేక్షణకు సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలో ప్రదీప్‌చంద్ర, ఎస్‌కే జోషి, రేమండ్ పీటర్, నాగిరెడ్డితో కార్యదర్శుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
నిబంధనలకు లోబడే..
సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలను నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ బుద్ధభవన్, రాణిగంజ్ బస్‌డిపో, లోయర్ ట్యాంక్‌బండ్, కుందన్‌బాగ్, పాటిగడ్డ, సెయిలింగ్ క్లబ్, యూ త్ హాస్టల్, రాఘవ సదన్, నర్సింగ్ కాలనీ, దిల్‌కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎలక్ట్రిసిటీ భవన్, టెక్ట్స్‌బుక్ ప్రింటింగ్ ప్రెస్, రిడ్జ్ హోటల్, బూర్గుల రామకృష్ణారావు భవనం, ఎక్స్‌పోటెల్, స్నోవరల్డ్ తదితర 40 ప్రాంతాల్లో దాదాపు వంద ఎకరాల్లో మొదటి దశలో ఆకాశహర్మ్యాలను నిర్మించాలని నిర్ణయిం చారు. ఈ స్థలాలకు సంబంధించిన మ్యాప్‌లను సీఎం పరిశీలించారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం పరిధికి అవతల, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ ప్రాంతాలున్నాయని సీఎం పేర్కొన్నారు. పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుం డా, సుప్రీంకోర్టు గత తీర్పులలోని మార్గదర్శకాలకు లోబడి వీటిని నిర్మిస్తామన్నారు. నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మొదటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. వీటి నిర్మాణానికి సంబంధించి వెంటనే విధివిధానాలను ఖరారు చేయాలని ఆదేశించారు.
వేసవిలో హుస్సేన్‌సాగర్ ఖాళీ!
Published Sun, Nov 23 2014 2:20 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement
Advertisement