హుస్సేన్‌సాగర్ వద్ద ఆకాశహర్మ్యాలు(ఊహా చిత్రం)
- పార్కును కొనసాగిస్తూనే.. మధ్యలో ప్రపంచంలోనే అతిపెద్ద భవన నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్... హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్ తీరంలో దాదాపు 92 ఎకరాల విస్తీర్ణంలోని ఈ పార్కును కొనసాగిస్తూనే.. దాని మధ్యలో అద్భుతమైన నమూనాతో, ప్రపంచంలోనే అతిపెద్దదిగా, అందమైన ఆకాశ హర్మ్యాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
హుస్సేన్‌సాగర్ చుట్టూ అందమైన ఆకాశహర్మ్యాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలపై సోమవారం అధికారులు అందజేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. హుస్సేన్‌సాగర్ పక్కన ఉన్న పాటిగడ్డ, నర్సింగ్ కాలేజీ, దిల్‌కుషా గెస్ట్‌హౌస్, రాఘవ టవర్స్ తదితర ప్రాంతాల్లో భారీ భవనాలు నిర్మించవచ్చని అధికారులు సీఎంకు వివరించారు. భారీ టవర్లు నిర్మించాలంటే ఎక్కువ స్థలం కావాల్సి ఉన్న విషయాన్ని కూడా వారు సీఎం వద్ద ప్రస్తావిం చారు.
లుంబినీపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్‌లు కూడా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనువైనవిగా వారు చెప్పినట్లు సమాచారం. బుద్ధభవన్ వద్ద కూడా టవర్ నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. వీటన్నింటినీ పరిశీలించిన సీఎం కేసీఆర్.. సంజీ వయ్య పార్కును యథాతథంగా కొనసాగిస్తూనే, దానిలోనే అతిపెద్ద భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం వారికి సూచించారు.
ఈ టవర్‌కు సంబంధించి డిజైన్ తదితరమైన వాటి కోసం త్వరలోనే కన్సల్టెంట్లను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాగా.. హైదరాబాద్‌లో రహదారులు, డ్రైనేజీని మెరుగుపర్చడం, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలకు సంబంధించి అధికారులు నెల రోజుల్లోగా టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది.