సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న నగర పోలీసులు మరో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ పోలీసు విభాగాలకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీలకు ఉన్న జనాదరణ, ప్రాచుర్యాన్ని ఇటీవల ఫేస్‌బుక్ సంస్థ అధికారికంగా లెక్కించింది. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగానికి చెందిన ‘హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజ్’ రెండో స్థానంలో, పోలీసు విభాగానికి చెందిన ‘హైదరాబాద్ సిటీ పోలీసు పేజ్’ నాలుగో స్థానంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ఫేస్‌బుక్ ఇటీవల పోలీసు విభాగానికి వర్తమానం సైతం పంపింది.
ఏడేళ్ల క్రితం అందుబాటులోకి...
నగర పోలీసు విభాగంతో పాటు ట్రాఫిక్ వింగ్స్ 2011 నుంచి అందుబాటులోకి వచ్చాయి. నగర ట్రాఫిక్ పోలీసులు సమస్యలను చక్కదిద్దడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను వినియోగించాలని అప్పట్లో ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసు ఫేస్‌బుక్‌కు రూపకల్పన జరిగింది. అప్పటి వరకు దేశంలో కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, చండీఘడ్‌లో మాత్రమే ట్రాఫిక్ ఫేస్‌బుక్ పేజ్‌లు ఉండేవి. వాటి తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఆ ఏడాది జూన్ నాటికి సిటీ ట్రాఫిక్ ఫేస్‌బుక్‌లో కేవలం 2500 మంది నెటిజన్లు మాత్రమే లైక్ చేసి సభ్యులుగా చేరారు. ఏడేళ్ల కాలంలో వీరి సంఖ్య 3.13 లక్షలకు చేరడంతో ఇది రెండో స్థానాన్ని, పోలీసు ఫేస్‌బుక్ పేజ్‌ను ఇప్పటి వరకు 2.12 లక్షల మంది లైక్ చేయడంతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాయి.
ప్రజలకు ఉపయుక్తంగా...
ఈ రెండు ఫేస్‌బుక్ పేజీలను పోలీసు విభాగం ప్రజలకు ఉపయుక్తంగా మారుస్తూ వస్తోంది. నేరాల నియంత్రణపై అప్రమత్తత, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ పేజ్‌ను వినియోగిస్తున్నారు. సిబ్బంది, అధికారులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఇచ్చే ఆస్కారం కల్పించారు. అలాగే ట్రాఫిక్ పేజ్‌ను ఉల్లంఘనుల గుర్తింపు, ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో ప్రజల భాగస్వామ్యం పెరిగి లైక్ చేస్తున్న వారిసంఖ్య లక్షలకు చేరింది. ఇందులో ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాలు, వస్తున్న ఫిర్యాదులనూ అధ్యయనం చేస్తున్న ఐటీ వింగ్స్ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నారు.
అన్నింటికీ.....
ఈ ఫేస్‌బుక్ పేజ్‌ల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అలర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలపై అధికారులకు ఫిర్యాదు/సమాచారం అందజేయవచ్చు. ప్రతి పౌరుడు
తన దృష్టికి
వచ్చిన ట్రాఫిక్ ఉల్లంఘన, నేరాన్ని ఫొటో తీసి, అది జరిగిన ప్రదేశం, సమయం తదితరాలను పొందుపరుస్తూ ఇందులో పోస్ట్ చేయవచ్చు. ప్రధానంగా పోలీసు అధికారుల ఉల్లంఘనలపై నిత్యం అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. వీటి ఆధారంగా దాదాపు 60 మంది పోలీసులపై చర్యలు సైతం తీసుకున్నారు. నగర పోలీసు పేజ్ ద్వారానూ ఇలాంటి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు పేజ్‌లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు 24 గంటలూ పని చేస్తున్నాయి.
మూడూ కలిస్తే మనమే టాప్...
దేశంలోని అన్ని పోలీసు విభాగాలకు చెందిన ఫేస్‌బుక్ పేజ్‌లు అధ్యయనం చేయగా, బెంగళూరు ట్రాఫిక్ పేజ్ తొలిస్థానంలో నిలిచింది. అక్కడ ఐటీ జోన్ ఎక్కువ కావడంతో పాటు ఒకే కమిషనరేట్ ఉండటంతోనే ఇది సా«ధ్యమైందని నగర అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధి మూడు కమిషనరేట్లుగా మారడంతో పాటు ఐటీ జోన్ మొత్తం శివార్లలో ఉండటంటో సిటీ సైట్స్ లైక్స్ తగ్గాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఇవి 2, 4 స్థానాల్లో ఉన్నాయని...మూడు కమిషనరేట్లనూ ఒకే యూనిట్‌గా పరిగణిస్తే ప్రథమ స్థానంలో ఉండటంతో పాటు కొత్త రికార్డు నెలకొల్పడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజలతో మమేకం కావడం, ఫేస్‌బుక్ పేజ్‌ల ద్వారా వారు ఇస్తున్న ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై స్పందించడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ సంస్థ లెక్కల ప్రకారంఇవీ టాప్ సిక్స్...
ఫేస్‌బుక్ పేజ్ లైక్స్
బెంగళూరు ట్రాఫిక్ 4.95 లక్షలు
హైదరాబాద్ ట్రాఫిక్ 3.13 లక్షలు
ఢిల్లీ ట్రాఫిక్ 2.61 లక్షలు
హైదరాబాద్ సిటీ 2.12 లక్షలు
కోల్‌కతా ట్రాఫిక్ 1.79 లక్షలు
సైబరాబాద్ ట్రాఫిక్ 41.3 వేలు
Comments
Please login to add a commentAdd a comment