
పటాన్‌చెరు టౌన్/మక్తల్: గ్రామాభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పనులు నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఆసక్తికరమైన రీతిలో జరిమానాలు విధించిన సంఘటనలు వెలుగు చూశాయి. ముత్తంగిలో జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి స్థానిక గుల్షన్ హోటల్ నిర్వాహకులు చెత్త పారబోస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ శ్రీశైలం, కోఆప్షన్ సభ్యుడు శ్రీధర్‌గౌడ్‌లు పట్టుకున్నారు. రహదారి పక్కన చెత్త వేసినందుకు ఆ హోటల్ యాజమాన్యానికి బుధవారం ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్ రూ. 10 వేల జరిమానా విధించారు. ఈ జరిమానాను ఆ హోటల్ నిర్వాహకులు చెల్లించారు.
అలాగే హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు మేయడంతో వాటి యజమానికి రూ. 3 వేల జరిమానా విధించినట్లు గ్రామ కార్యదర్శి కిషోర్ తెలిపారు. మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో కూడా మేకలు హరితహారంలో నాటిన మొక్కలు మేసినందుకు అధికారులు వాటి యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మేకలను పట్టుకుని కట్టేశారు. యజమాని వచ్చి రూ.10 వేలు చెల్లిస్తేనే మేకలను వదులుతామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment