సాక్షి, శంషాబాద్: మెట్రో రైలును శంషాబాద్ వరకు పొడిగించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన మొదటి దశ మెట్రో రైలుకు అనూహ్య స్పందన లభిస్తుండడంతో రెండో దశలోనే శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రోను అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో వెల్లడించారు. రెండో దశలో 80 కిలో మీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా మెట్రో రైలును శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పొడిగించనున్నట్టు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలనే ఆలోచనను వెల్లడించారు. కాగా, నగరంలో మెట్రో రైలును ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలు విషయంలో మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. మెట్రో రైలును విమానాశ్రయానికి అనుసంధానించారా లేదా అన్న విషయాన్ని కూడా చర్చించినట్లు సమాచారం. విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం అన్న అంశంపై ప్రభుత్వవర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఏ మార్గం గుండా...
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధానించేందుకు రెండు మార్గాలున్నాయి. ఎల్‌బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట అక్కడి నుంచి పాతకర్నూలు రహదారి, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఎయిర్‌పోర్టుకు ఉన్న రహదారి గుండా మెట్రోను అనుసంధానించనున్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. ఇటీవల హైటెక్ సిటీ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మార్గం గుండా ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలును అనుసంధానం చేసే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రతిరోజు నలభైవేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైలు సౌకర్యం వస్తే ట్రాఫిక్ సమస్యలు కూడా తీరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment