‘నిమ్స్‌’ ప్రతిష్టపై నీలినీడలు | Hyderabad NIMS Hospital | Sakshi
Sakshi News home page

‘నిమ్స్‌’ ప్రతిష్టపై నీలినీడలు

Published Thu, Aug 22 2019 12:00 PM | Last Updated on Thu, Aug 22 2019 12:00 PM

Hyderabad NIMS Hospital  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘రౌతు మెత్తనైతే గర్రం మూడుళ్ల మీద పరిగెడుతుందని సామెత’.. ఇది నిమ్స్‌ ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలకు సరిగ్గా సరిపోతుంది. ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో బిజీబిజీగా చికిత్సలు చేస్తున్నా.. కీలకమైన అత్యవసర చికిత్సా విభాగంలోకి ప్రయివేటు వైద్యులు చొచ్చుకొచ్చినా.. మెడికో లీగల్‌ కేసుల సర్జరీలను సైతం వారే చేస్తున్నా నిమ్స్‌ డైరెక్టర్‌ పట్టించుకోరు. ప్రఖ్యాతి గాంచిన నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరువును నిలువునా తీసేస్తున్నా పర్యవేక్షించాల్సిన బాధ్యుడు పట్టించకోరు. నిత్యం సచివాలయం చుట్టూ చక్కర్లు.. మంత్రులతో మంతనాలతోనే గడిపేస్తారు. ఎమర్జెన్సీ విభాగంలో ఉండాల్సిన ఇద్దరు వైద్యులు ఎక్కడికి వెళతారో తెలియదు. వారి స్థానంలో మరో ఇద్దరు ప్రయివేటు వైద్యులు కనిపిస్తారు. వారిని ఎవరు తీసుకు వచ్చారో నిమ్స్‌ డైరెక్టర్‌ సమాధానం చెప్పరు.

న్యూరో సర్జరీ విభాగంలో డాక్టర్‌ వంశీ కృష్ణ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. నిమ్స్‌లో మాత్రమే విధులు నిర్వహించాల్సిన ఈయన పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేశారు. గతేడాది జరిగిన ఈ సంఘటనపై ఆ విభాగాధిపతి డాక్టర్‌ విజయ్‌ సారథి సీరియస్‌గా తీసుకుని డైరెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లగా మెమో ఇచ్చి సరిపెట్టారు తప్ప ఆయనపై చర్యలు మాత్రం తీసుకోలేదు. అత్యవసర చికిత్సా విభాగంలో విధులు నిర్వహించాల్సిన వైద్యులు దూర్దానా, శరోన్‌ అప్పట్లో గైర్హాజరయ్యారు. వారు ఎక్కడికి వెళ్లినట్టో తెలియని పరిస్థితి. కానీ వారిస్థానంలో వైద్యులుగా  ప్రజ్ఞ, అలీ నిమ్స్‌కు వచ్చారు. ఆస్పత్రి డైరెక్టర్‌కు అంతా తెలిసే జరిగిందా..? తెలియకుంటే ఎందుకు ఆయా విభాగం అధినేతపై చర్యలు తీసుకోలేదో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే.. అదే సమయంలో ఓ ఖైదీ మృతి చెందిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో సదరు వైద్యుల బండారం బయట పడుతుందని.. కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అక్కడి నుంచి వెళ్లి పోయారు. 

వారితోపాటు వైద్యులు దూర్దానా, శరోన్‌ కూడా వెళ్లి పోయారు. ఇదిలా ఉండగా.. నిమ్స్‌లో వైద్యుడిగా విధులు నిర్వహిస్తూ ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ చికిత్సను నిర్వహిస్తూ కొందరు వైద్యులు నిమ్స్‌కు ఆలస్యంగా వస్తుంటారు. ‘ప్రయివేటు’ సేవలపై ఉన్న మమకారంతో ఇక్కడి రోగులపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో పలు అనర్థాలు జరుగుతున్నాయి. చికిత్స సమయంలో రోగి పొట్టలో కత్తెరలు మరిచి పోవడం లాంటి ఘటనలు అలాగే చోటుచేసుకున్నాయి. గతంలో హెర్నియాకు చికిత్స చేయాలంటూ వచ్చిన హర్షవర్ధన్‌ భార్య మహేశ్వరి పొట్టలో కత్తెర పెట్టి కుట్లేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విచారణ కమిటీ పేరుతో ఆ వైద్యుడిని తప్పించారు. రోగుల శ్రేయస్సు, ఆస్పత్రి ప్రతిష్ఠ దృష్ట్యా నిమ్స్‌ యాజమాన్యం ఇటువంటి ఘటనలకు తావులేకుండా చూడాల్సి ఉంది. 

నిమ్స్‌లో ఇలాంటి బాధ్యతా రహితంగా పలు సంఘటనలు జరుగుతున్నా డైరెక్టర్‌ మాత్రం దేన్నీ సీరియస్‌గా తీసుకోవడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రయివేటు వైద్యులు చికిత్స నిర్వహించడం చట్టరీత్యా నేరం. అయినా సరే దానిని విస్మరించి కొన్నాళ్లపాటు వైద్యం నిర్వహించారంటే దాని వెనుక పెద్ద తలకాయే ఉందని ఇక్కడ పనిచేస్తున్న పలువురు వైద్యులు అనుమానిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement