
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్న ‘నిషా’చరులు గత నెలలో చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా.? అక్షరాల రూ.49,64,400. 498 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ బుధవారం వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికీ రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడిందని ఆయన పేర్కొన్నారు. 167 మంది డ్రైవింగ్ లైసెన్సులను (డీఎల్స్) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడం, సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు నలుగురి డ్రైవింగ్ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా.. 17 మందివి మూడేళ్లు, 29 మందివి రెండేళ్లు, 16 మందివి ఏడాదిన్నర, 40 మందివి ఏడాది, 59 మందివి ఆరు నెలలు, ఒకరిది నాలుగు నెలలు, మరొకరిది వారం పాటు సస్పెండ్ చేసినట్లు అనిల్‌కుమార్ వెల్లడించారు.
జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి నెల, 26 మందికి 10 రోజులు, 47 మందికి వారం, ఎనిమిది మందికి ఆరు రోజులు, 21 మందికి ఐదు రోజులు, మరో 21 మందికి నాలుగు రోజులు, 42 మందికి మూడు రోజులు, 125 మందికి రెండు రోజులు, 93 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. మరో 116 మంది కోర్టు సమయం ముగిసే వరకు అక్కడే ఉండేలా న్యాయమూర్తి శిక్ష విధించారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సెలింగ్ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్టు, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని అనిల్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment