
ఏడాదిలో హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు
సోమాజిగూడ (హైదరాబాద్) : వచ్చే ఏడాది కాలంలో నగరవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. సోమవారం సీసీ కెమెరాల నిర్వహణపై కానిస్టేబుళ్లకు నిర్వహించిన శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలోని అన్ని ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు, కాలనీలు, విద్యాలయాలు, కళాశాలలతోపాటు ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ క్రమంలో కెమెరాల నిర్వహణ, సమాచార విశ్లేషణకు నిపుణుల కొరత ఉందన్నారు. దీంతో ఇంజనీరింగ్ చదువుకొని పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 28 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. వీరు సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, సమాచార విశ్లేషణతో పాటు కమాండ్ కంట్రోల్‌కు నిరంతరం సమాచారం అందిస్తారని చెప్పారు. మరి కొంతమంది కానిస్టేబుళ్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించనున్నామని పేర్కొన్నారు.