కొత్తపేటకు చెందిన దంపతులు ఫిబ్రవరి ఒకటిన మలక్‌పేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో కొందరు దుండగులు వారి దృష్టి మళ్లించి రూ.3 లక్షలు చోరీ చేశారు. ఈ కేసును ఏఎన్‌పీఆర్ సిస్టం ద్వారానే కొలిక్కి తెచ్చారు.బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా సంచరిస్తున్న ఓ ఆటో గతంలో చోరీకి గురైంది. కాగా ట్రాఫిక్ పోలీసులు ఏఎన్‌పీఆర్ సాఫ్ట్‌వేర్ వినియోగించి గుర్తించారు. దీన్ని రికవరీ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.
సాక్షి, సిటీబ్యూరో: ఈ–చలాన్ భారీగా బకాయిలు ఉండి స్వేచ్ఛగా విహరిస్తున్న వాహనాలు.... ఓ పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురై మరో ఠాణా పరిధిలో తిరిగేస్తున్న వెహికిల్స్... ఓ జోన్ పరిధిలోని నేరంలో వాంటెడ్‌గా ఉన్నప్పటికీ మరో జోన్‌లో సంచరించే వాహనాలు... పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. ఇకపై వీటికి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్(ఏఎన్‌పీఆర్) అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన కెమెరాలు చెక్ చెబుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) ద్వారా ట్రాఫిక్ కెమెరాలకు దీన్ని ఏర్పాటు చేశారు. సిటీలోని 250 జంక్షన్లలోని కెమెరాల్లో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే 13 కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి ఉపకరించింది.
సాఫ్ట్‌వేర్ ఆధారిత పరిజ్ఞానం...
ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) సిస్టమ్ పూర్తి సాఫ్ట్‌వేర్ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం. దీన్ని బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ట్రాఫిక్ విభాగం వద్ద ఉన్న పెండింగ్ ఈ–చలాన్ల డేటాబేస్, సీసీఎస్ ఆధీనంలోని చోరీ వాహనాల డేటాబేస్‌తో పాటు వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాహనాల నెంబర్లతో కూడిన డేటాబేస్‌నూ ఈ సర్వర్‌కు అనుసంధానించారు. నగర వ్యాప్తంగా అనేక జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను ఈ సర్వర్‌కు సింక్రనైజ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండనున్న నేపథ్యంలో 24 గంటలూ నిర్విరామంగా ఈ సర్వర్ పని చేస్తూనే ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల ముందు ఈ మూడు తరహాలకు చెందిన వాహనాల్లో ఏది వచ్చినా... సర్వర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఆధారంగా కెమెరాలు ఆ విషయాన్ని తక్షణం గుర్తిస్తాయి. ఏ ప్రాంతంలో ఉన్న కెమెరా ముందుకు ఆ వాహనం వచ్చిందనే వివరాలను కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి భారీ స్క్రీన్‌పై పాప్‌అప్ రూపంలో అందిస్తాయి. దీంతో అప్రమత్తమయ్యే అక్కడి సిబ్బంది ఆ కెమెరా ఉన్న ప్రాంతంలో క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా సదరు వాహనచోదకుడిని పట్టుకునేలా చేస్తున్నారు.
ప్లేట్లలో కచ్చితత్వం తప్పనిసరి...
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఏ తరహాకు చెందిన, ఏ పరిమాణంలో ఉండాలనేది మోటారు వాహనాల చట్టం స్పష్టంగా నిర్దేశించింది. ప్రస్తుతం నగరంలోని వాహనచోదకులు దీన్ని పూర్తిస్థాయిలో పట్టించుకోవట్లేదు. ఫలితంగా నెంబర్ ప్లేట్లు, వాటిలో ఉండే అక్షరాలు, అంకెలు తమకు నచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నెంబర్ ప్లేట్లపై ఉన్న అంకెలు, అక్షరాలను అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) సిస్టమ్ పని చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు నెంబర్ ప్లేట్లలో కచ్చితత్వం ఉండేలా, మోటారు వాహనాల చట్టం నిర్దేశించినట్లే అవి ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్నారు. వాహనాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది. ఇది కచ్చితంగా మారి, అన్ని వాహనాలకు అమలైతే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ నెంబర్ ప్లేట్లలో యూనిఫామిటీ ఉండటంతో సాఫ్ట్‌వేర్ కచ్చితంగా గుర్తించడంతో పాటు పొరపాట్లకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు.
కొలిక్కి వచ్చిన కేసుల్లో కొన్ని...
♦ జనవరి 31న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతికి కారణమైన తేలికపాటి వాహనాన్ని గుర్తించారు.
♦ జనవరి 5న రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ వాహనం నెంబర్ ఆధారంగా దాని కదలికలు పాతబస్తీలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద గుర్తించి పట్టుకున్నారు.
♦ బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా సంచరిస్తున్న ఓ ఆటో గతంలో చోరీకి గురైందిగా ట్రాఫిక్ పోలీసులు ఈ సాఫ్ట్‌వేర్ వినియోగించి గుర్తించారు. దీన్ని రికవరీ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment