anpr Technology
-
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా.. ఇక వారి ఆటలు సాగవు
బనశంకరి: కర్నాటకలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ ఉల్లంఘనులపై నిఘా కోసం అమర్చిన ఆటోమేటిక్ నంబరు ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా 3 లక్షల 90 వేల పెండింగ్ కేసులను కనిపెట్టారు. అతిక్రమణదారుల నుంచి రూ. 21 కోట్లు జరిమానాలను వసూలు చేశారు. మార్చి నుంచి అమల్లోకి బెంగళూరు నగరంలో అధిక వాహనాల రద్దీ కలిగిన జంక్షన్లు, ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండా సంచార వ్యవస్థ నిర్వహణ కోసం ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 చోట్ల ఏఎన్పీఆర్ కెమెరాలు అమర్చారు. అప్పటి నుంచి జూలై 19 వరకు రోజుకు సరాసరి 2,765 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులను గుర్తించారు. చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలు అనేకం దొరికాయి. అలా 3.90 లక్షల పెండింగ్ కేసులను కనిపెట్టారు. ఎలా పనిచేస్తాయంటే అత్యాధునిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తాయి. ఏఎన్పీఆర్ కెమెరాలు అమర్చిన మార్గాల్లో సంచరించే వాహనాల నంబరు ప్లేట్లపై కెమెరాలు నిఘాపెడతాయి. ఆ నంబరుతో వాహనాలు నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే నమోదు చేసి తక్షణం సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మొబైల్‌కు మెసేజ్ పంపుతుంది. దీని ఆధారంగా పోలీసులు సదరు వాహనం దగ్గరికి రాగానే వాహనదారున్ని అడ్డుకుని కేసు రాసి జరిమానా వసూలు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఏర్పాటు? ఈ కెమెరాలను అమర్చడంతో ట్రాఫిక్ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే తరహా కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు అమరుస్తున్నారు. ఏఎన్పీఆర్ కెమెరాలు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన, పాత కేసుల ఆచూకీ కనిపెట్టడంతో పాటు చోరీకి గురైన వాహనాలను కనిపెట్టేందుకు సాయపడతాయని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంతేగౌడ తెలిపారు. 69 చలానాలతో దొరికాడు సుమారు 69 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడి జరిమానా చెల్లించని బైకిస్టు కోరమంగల 6వ బ్లాక్ 80 ఫీట్ రోడ్డులో అమర్చిన ఏఎన్పీఆర్ కెమెరా సమీపంలో దొరికాడు. అతని గురించి ట్రాఫిక్ పోలీసుల మొబైల్‌కు మెసేజ్ రావడంతో నిఘా వేసి పట్టుకున్నారు. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, సక్రమంగా నడుపుతున్నా, ఎందుకు వాహనాన్ని అడ్డుకున్నారని వాగి్వవాదం చేశాడు. అతని వాహన రిజి్రస్టేషన్ నంబరు ఆధారంగా పరిశీలించగా గతంలో 69 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినట్లు నమోదై ఉంది. రూ.34,600 జరిమానాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది కూడా చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
వాహనం నంబర్‌తో కేసు బుక్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినా, కొందరు కర్ఫ్యూ ఆంక్షలను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూ హం పన్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్ పీఆర్) సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు. దాని ఆధారంగా వారిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం కేసులను నమోదు చేస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. వాహన యజమాని వివరాలు ప్రత్యక్షమవుతాయి. కేసుల్లో ఇరుక్కోవద్దు: లాక్డౌన్ నిబంధనల ప్ర కారం.. ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమి తం కావాలి. కానీ, పలువురు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు. గంటల్లోనే సదరు వాహన యజమాని అరెస్టు అవుతారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో సదరు వాహనం యజమానిపై ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడు తుందని హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఇళ్ల నుం చి బయటికి వచ్చే వాహనదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చలాన్ పెండింగ్.. ఈ కెమెరాకు చిక్కితే అంతే..
కొత్తపేటకు చెందిన దంపతులు ఫిబ్రవరి ఒకటిన మలక్‌పేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో కొందరు దుండగులు వారి దృష్టి మళ్లించి రూ.3 లక్షలు చోరీ చేశారు. ఈ కేసును ఏఎన్పీఆర్ సిస్టం ద్వారానే కొలిక్కి తెచ్చారు.బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా సంచరిస్తున్న ఓ ఆటో గతంలో చోరీకి గురైంది. కాగా ట్రాఫిక్ పోలీసులు ఏఎన్పీఆర్ సాఫ్ట్వేర్ వినియోగించి గుర్తించారు. దీన్ని రికవరీ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. సాక్షి, సిటీబ్యూరో: ఈ–చలాన్ భారీగా బకాయిలు ఉండి స్వేచ్ఛగా విహరిస్తున్న వాహనాలు.... ఓ పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురై మరో ఠాణా పరిధిలో తిరిగేస్తున్న వెహికిల్స్... ఓ జోన్ పరిధిలోని నేరంలో వాంటెడ్‌గా ఉన్నప్పటికీ మరో జోన్లో సంచరించే వాహనాలు... పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. ఇకపై వీటికి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్(ఏఎన్పీఆర్) అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన కెమెరాలు చెక్ చెబుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) ద్వారా ట్రాఫిక్ కెమెరాలకు దీన్ని ఏర్పాటు చేశారు. సిటీలోని 250 జంక్షన్లలోని కెమెరాల్లో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే 13 కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి ఉపకరించింది. సాఫ్ట్వేర్ ఆధారిత పరిజ్ఞానం... ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) సిస్టమ్ పూర్తి సాఫ్ట్వేర్ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం. దీన్ని బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ట్రాఫిక్ విభాగం వద్ద ఉన్న పెండింగ్ ఈ–చలాన్ల డేటాబేస్, సీసీఎస్ ఆధీనంలోని చోరీ వాహనాల డేటాబేస్‌తో పాటు వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాహనాల నెంబర్లతో కూడిన డేటాబేస్‌నూ ఈ సర్వర్‌కు అనుసంధానించారు. నగర వ్యాప్తంగా అనేక జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను ఈ సర్వర్‌కు సింక్రనైజ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండనున్న నేపథ్యంలో 24 గంటలూ నిర్విరామంగా ఈ సర్వర్ పని చేస్తూనే ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల ముందు ఈ మూడు తరహాలకు చెందిన వాహనాల్లో ఏది వచ్చినా... సర్వర్‌లో ఉన్న సాఫ్ట్వేర్ ఆధారంగా కెమెరాలు ఆ విషయాన్ని తక్షణం గుర్తిస్తాయి. ఏ ప్రాంతంలో ఉన్న కెమెరా ముందుకు ఆ వాహనం వచ్చిందనే వివరాలను కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి భారీ స్క్రీన్‌పై పాప్అప్ రూపంలో అందిస్తాయి. దీంతో అప్రమత్తమయ్యే అక్కడి సిబ్బంది ఆ కెమెరా ఉన్న ప్రాంతంలో క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా సదరు వాహనచోదకుడిని పట్టుకునేలా చేస్తున్నారు. ప్లేట్లలో కచ్చితత్వం తప్పనిసరి... ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఏ తరహాకు చెందిన, ఏ పరిమాణంలో ఉండాలనేది మోటారు వాహనాల చట్టం స్పష్టంగా నిర్దేశించింది. ప్రస్తుతం నగరంలోని వాహనచోదకులు దీన్ని పూర్తిస్థాయిలో పట్టించుకోవట్లేదు. ఫలితంగా నెంబర్ ప్లేట్లు, వాటిలో ఉండే అక్షరాలు, అంకెలు తమకు నచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నెంబర్ ప్లేట్లపై ఉన్న అంకెలు, అక్షరాలను అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) సిస్టమ్ పని చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు నెంబర్ ప్లేట్లలో కచ్చితత్వం ఉండేలా, మోటారు వాహనాల చట్టం నిర్దేశించినట్లే అవి ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్నారు. వాహనాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది. ఇది కచ్చితంగా మారి, అన్ని వాహనాలకు అమలైతే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ నెంబర్ ప్లేట్లలో యూనిఫామిటీ ఉండటంతో సాఫ్ట్వేర్ కచ్చితంగా గుర్తించడంతో పాటు పొరపాట్లకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. కొలిక్కి వచ్చిన కేసుల్లో కొన్ని... ♦ జనవరి 31న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతికి కారణమైన తేలికపాటి వాహనాన్ని గుర్తించారు. ♦ జనవరి 5న రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ వాహనం నెంబర్ ఆధారంగా దాని కదలికలు పాతబస్తీలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద గుర్తించి పట్టుకున్నారు. ♦ బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా సంచరిస్తున్న ఓ ఆటో గతంలో చోరీకి గురైందిగా ట్రాఫిక్ పోలీసులు ఈ సాఫ్ట్వేర్ వినియోగించి గుర్తించారు. దీన్ని రికవరీ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. -
అతివేగానికి కళ్లెం..
- ముఖ్య కూడళ్లలో హైటెక్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు - వాహన నంబర్ సహా గుర్తించగలిగే ఏఎన్పీఆర్ టెక్నాలజీ వినియోగం - ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ విభాగం చర్యలు సాక్షి, ముంబై: నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే దిశగా ట్రాఫిక్ విభాగం చర్యలు తీసుకుంటోంది. మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలకు కళ్లెం వేయడానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు గాను వాహన వేగాన్ని నియంత్రించేందుకు నగరంలోని ఐదు ముఖ్య కూడళ్లలో నంబర్ ప్లేట్లను కూడా రికార్డు చేసే కొత్త హైటెక్ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కెమెరాల్లో వాహన నంబర్లను స్పష్టంగా చదివే విధంగా పరికరాలను అమర్చనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఏ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువ వేగంతో వెళుతున్నాయో ఆ ప్రదేశాల్లో ఈ కెమెరాలను అమర్చనున్నారు. అంతేకాకుండా ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీతో కూడుకున్న సీసీటీవీ కెమెరాలను అమర్చాల్సిందిగా ఏజెన్సీలను ట్రాఫిక్ విభాగం కోరింది. బాంద్రా-వర్లీ సీలింక్ (బీడబ్ల్యూఎస్‌ఎల్)పై కూడా ఈ కెమెరాలను ఈ ఏడాది చివరికల్లా అమర్చనున్నారు. అదేవిధంగా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), విక్రోలిలోని గోద్రేజ్ జంక్షన్, మెరిన్ డ్రైవ్, సౌత్ ముంబైలోని జేజే ఫ్లై ఓవర్లలో కూడా ఈ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారిని పట్టుకోవడం కోసం ఏఎన్పీఆర్ కెమెరాలనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇదిలా వుండగా నగరవ్యాప్తంగా ఈ కెమరాలను ఏఏ ప్రదేశాల్లో అమర్చాలో ఇప్పటికే అధ్యయనం నిర్వహించామని అడిషినల్ కమిషనర్ (ట్రాఫిక్) క్వైజర్ ఖలీద్ తెలిపారు. విక్రోలిలోని గోద్రేజ్ జంక్షన్లో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. బాంద్రా-వర్లీ సీలింక్ కూడా ప్రమాదాలకు నిలయంగా మారుతోందని, ఇక్కడ కూడా వాహన దారులు అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆయన తెలిపారు. కాగా బాంద్రా-వర్లీ సీలింక్‌పై రెండు వైపులా ఈ కెమరాలను అమర్చనున్నారు. కాగా, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ మార్గంపై కూడా ఈ కెమెరాలను అమర్చే అవసరముందా అనే అంశంపై అధ్యయనం నిర్వహించనున్నారని ఎంఎస్ఆర్డీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే బీడబ్ల్యూఎస్‌ఎల్, జేజే ఫ్లై ఓవర్‌పై ద్విచక్రవాహనాలను నిషేధించారు. 2002-10 మధ్య కాలంలో జేజే ఫ్లై ఓవర్‌పై 254 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 183 ద్విచక్రవాహనాల వల్లనే జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 33 మంది మరణించగా, అందులో 31 మంది ద్విచక్రవాహన దారులే. వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన బీకేసీ వద్ద కార్యాలయ పని గంటలు ముగిసిన వెంటనే మితిమీరిన వేగంతో వాహనాలు వెళుతుండాన్ని గమనించామని ఆయన తెలిపారు. దీంతో ఆయా మార్గాలన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు.