
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా, కొందరు కర్ఫ్యూ ఆంక్షలను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూ హం పన్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్ పీఆర్) సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు. దాని ఆధారంగా వారిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం కేసులను నమోదు చేస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. వాహన యజమాని వివరాలు ప్రత్యక్షమవుతాయి.
కేసుల్లో ఇరుక్కోవద్దు: లాక్‌డౌన్ నిబంధనల ప్ర కారం.. ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమి తం కావాలి. కానీ, పలువురు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు. గంటల్లోనే సదరు వాహన యజమాని అరెస్టు అవుతారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో సదరు వాహనం యజమానిపై ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడు తుందని హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఇళ్ల నుం చి బయటికి వచ్చే వాహనదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment