సాక్షి, సిటీబ్యూరో: ‘కోవిడ్ సోకితే అయినవారు కూడా ఆమడదూరంలో ఉంటున్నారు. మేం రోజుల తరబడి కుటుంబాలకు దూరమై.. ప్రాణాలపై ఆశ వదులుకుని కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాం. అయినా.. మాకు రెండు నెలలుగా స్పెషల్ ఇన్సెంటివ్ నిలిచిపోయింది’ అని కోవిడ్ వైద్య సేవల్లో నిమగ్నమైన ప్రభుత్వ వైద్య సిబ్బంది నిరాశకు గురవుతుండగా, మరో వైపు లాక్‌డౌన్‌ను ముందునుంచీ నియంత్రించి ప్రస్తుతం ప్లాస్మా దానంతో కోవిడ్ వార్‌లో నిలిచిన పోలీస్‌లకు సైతం స్పెషల్ ఇన్సెంటివ్ నిలిచిపోయింది. చనిపోయిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల బీమా దస్త్రం ముందుకు కదలడంలేదన్న వేదన వారిని వెంటాడుతోంది. విధుల్లో ఉండి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కోవిడ్ బారిన పడ్డవారి సంఖ్య 2,700 దాటింది. మృతుల సంఖ్య బుధవారానికి పదమూడుకు చేరింది. కోవిడ్ బారిన పడ్డ పోలీస్‌లకు ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రత పథకం కింద వైద్య సేవలకు అనుమతించకపోవటం కూడా సిబ్బందిలో మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది.
అందరినీ చుట్టేస్తోంది..
నగర పోలీసు విభాగాన్ని కరోనా వైరస్ అనూహ్యంగా చుట్టేస్తోంది. లాక్‌డౌన్ అమలులోకి వచ్చిననాటి నుంచి పోలీసు అధికారులు అనునిత్యం విధులకు అంకితమయ్యారు. సర్వకాల సర్వావస్థల్లోనూ కరోనాను కట్టడి చేయడానికి, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా చూసేందుకు పని చేశారు. లాక్‌డౌన్ ఎత్తేసినా.. కంటైన్మెంట్ ఏరియాలు, గాంధీ ఆస్పత్రి వద్ద వీరికి విధులు తప్పలేదు. దీంతో అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. నగర పోలీసు విభాగానికి సంబంధించి తొలి పాజిటివ్ కేసు సైఫాబాద్ ఠాణాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో అత్యధికం రోడ్లపైకి వచ్చి డ్యూటీలు చేసే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఎలాంటి ఫీల్డ్ టచ్ లేని, కార్యాలయాల్లో మాత్రమే ఉండి విధులు నిర్వర్తించిన వారికీ వైరస్ సోకుతోంది. ఠాణాలకు వచ్చి వెళ్లిన బాధితులు, ఆయా అధికారులు/సిబ్బంది నివసిస్తున్న ప్రాంతాలు, సహోద్యోగుల ప్రభావమే దీనికి కారణమై ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఇప్పటి వరకు నగరంలో 1,843, సైబరాబాద్‌లో 400, రాచకొండలో 480 మంది అధికారులు/సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వీరిలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సైతం ఉన్నారు.
కుటుంబాలకు దూరంగా..
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ ఆస్పత్రిగా మారిన గాంధీకి పోలీసు విభాగం అదనపు భద్రత కల్పిస్తోంది. ఇటీవల నెలకొన్న పరిణామాలతో ఈ చర్యలు మరింత పెరిగాయి. రెగ్యులర్‌గా పికెట్ డ్యూటీలో ఉండే వారికి అదనంగా భారీగా సిబ్బంది, అధికారుల్ని మోహరించింది. దీంతో వీరితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది సైతం తమ కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా వారికి దూరంగా ఉంటున్నారు. కొందరు ఠాణాలకే పరిమితం కాగా... మరికొందరు చిన్నచిన్న గదులు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కోవిడ్ డ్యూటీలతో ఏ మాత్రం సంబంధం లేని విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలోనూ అనేక మంది వైరస్ బారినపడటంతో ఇలాంటి వారు సైతం తమ కుటుంబాలను స్వస్థలాలకు పంపి ఒంటరిగా నివస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
‘భద్రత’ లేదు.. ‘పరిహారం’ రాదు..
కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దానిపై వార్ చేస్తున్న వారియర్స్‌లో అసువులు బాసిన వారికి పరిహారం ప్రకటించింది. ప్రధానంగా వైద్యులు, ఆ సిబ్బంది, పారిశుద్ధ్య విభాగాలకు రూ.50 లక్షలు చొప్పున బీమా ప్రకటించింది. పోలీసుల విషయం కేంద్రం పట్టించుకోకపోవడంతో అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చి వీరికి పరిహారం ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్; మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు రూ.50 లక్షలు, ఢిల్లీ రూ.కోటి చొప్పున అందిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనూ రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నా.. ఇప్పటికీ అవి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. మరోపక్క పోలీసు విభాగంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే వారికి ఆరోగ్య భద్రత పథకం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. కోవిడ్‌కు ఈ పథకం వర్తించదంటూ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో తమ సొంత ఖర్చులతో లేదంటే గాంధీ ఆస్పత్రిలో వైద్యం పొందాల్సి వస్తోంది.
తీవ్ర ఆందోళనలో పోలీసు కుటుంబాలు..
వైరస్ పోలీసు విభాగాన్ని ఈ స్థాయిలో చుట్టేస్తుండటంతో పాటు ముందు జాగ్రత్త చర్యగా గతంలో వినియోగించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు దుష్ఫ్రభావాలు చూపుతుండటం, ఇన్సూరెన్స్‌తో పాటు పరిహారం లేకపోవడం వెరసి.. వారి కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబీకుల్లో లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించడానికి గోషామహల్‌లోని పోలీసుస్టేడియంలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. అక్కడా ఆశించిన స్థాయిలో, అదే వేగంగా పరీక్షలు జరగట్లేదని సిబ్బంది వాపోతున్నారు. ఈ పరిణామాలతో గాంధీ ఆస్పత్రితో పాటు కంటైన్మెంట్ ఏరియాల్లో పని చేసిన సిబ్బంది, అధికారులతో పాటు వారి కుటుంబీకుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిహారం ప్రకటించడంతో పాటు ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతున్నారు.
కరోనా వైరస్‌తో మృతిచెందిన పోలీసులు
⇔ కుల్సుంపుర కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి
⇔ డబీర్‌పుర హోంగార్డు అశోక్‌కుమార్
⇔ ఎస్సార్‌నగర్ ట్రాఫిక్ ఏఎస్సై మహ్మద్ తమీజుద్దీన్
⇔ కుల్సుంపురా హెడ్ కానిస్టేబుల్ సమద్
⇔ బంజారాహిల్స్ ఏఎస్సై ప్రేమ్‌కుమార్
⇔ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జిలానీ
⇔ కాలాపత్తర్ ఏఎస్సై మహ్మద్ యూసుఫ్
⇔ ఎస్సార్‌నగర్ హోంగార్డు అక్బర్ అలీ
⇔ ఆసిఫ్‌నగర్ ఏఎస్సై సుధీర్‌కుమార్
⇔ హెడ్ క్వార్టర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంబాబు
⇔ సిటీ సెక్యూరిటీ వింగ్ హెడ్ కానిస్టేబుల్ మద్దిలేటి
⇔ సైదాబాద్ కానిస్టేబుల్ ఎస్.శిరీష్
⇔ బాచుపల్లి ఎస్సై మహ్మద్ యూసుఫ్
Comments
Please login to add a commentAdd a comment