కేసీఆర్ మార్కులు పట్టించుకోను: జానారెడ్డి
తాను అస్సలు సర్వేలు నమ్మబోనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ప్రజల తీర్పునే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మార్కులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సరదాగ సీఎల్పీలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేయించిన సర్వేలపై జానారెడ్డిని ప్రశ్నించగా తాను కేసీఆర్ సర్వేలు పట్టించుకోనని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుబారాలో ఇదొకటి అని, అసలు ప్రభుత్వ సొమ్ముతో ఇలా సర్వేలు చేస్తారా అని ప్రశ్నించారు.
ప్రజలే తీర్పే ఫైనల్ అని చెప్పారు. ఈ రోజుల్లో మీడియా కూడా సరిగా సర్వేలు చేయలేకపోతోందని చెప్పిన జానా.. తాను ఓడిపోతానని ఎన్నోసార్లు సర్వేల పేరిట కథనాలు రాశారని గుర్తు చేశారు. తాను సర్వేలపై ఆధారపడే మనిషిని కాదని జానా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ పార్టీతోనూ తమకు అవగాహన లేదని చెప్పారు.
‘ఇతర పార్టీలతో అవగాహనలన్నీ ఎన్నికల ముందు ఉండే తతంగాలు. నేను సీఎం అని పదిమందితో అనిపించుకుంటాను. అంత మాత్రాన అవుతామా? ఎవరో అనగానే సీఎం అయిపోతామని నేను భ్రమించను. అభిమానంతో వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అర్హత ఉందని నేను అనుకుంటా. అంత మాత్రాన అయిపోతామని కాదు. రకరకాల కారణాలతో నిర్ణయాలు ఉంటాయి. సీఎం అవుతానని నేనెప్పుడు చెప్పలేదు. హిందీ నేర్చుకుంటుంటే కూడా రకరకాల ప్రచారం చేశారు’ అని జానారెడ్డి చెప్పారు.