హోరాహోరీగా ట్రంప్, హారిస్ ప్రచారం
రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. కమలా హారిస్ రూపంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ పీఠమెక్కుతారా, లేక పాత కాపు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయఢంకా మోగిస్తారా అన్నది ఆసక్తకరంగా మారింది. రెండు వారాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వారి విజయావకాశాలపై అమెరికా అంతటా జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సర్వేలు ఏం చెబుతున్నాయనే అంశాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటూ ఓటర్లు తలమునకలుగా ఉన్నారు.
జాతీయ పోలింగ్ సగటులో హారిస్ ముందంజ
జాతీయ పోలింగ్ సగటులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిసే ముందంజలో ఉన్నారు. ఏబీసీ న్యూస్, వెబ్‌సైట్ 538 గణాంకాల ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు దేశవ్యాప్తంగా 46 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. హారిస్‌కు కాస్త ఎక్కువగా 48 శాతం మంది మద్దతుండటం విశేషం. అధ్యక్షుడు జో బైడెన్‌ను కాదని హారిస్‌ను డెమొక్రటిక్ పార్టీ బరిలో దింపడం తెలిసిందే. అనంతరం ఆమెకు ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది.
సెపె్టంబర్ నుంచి హారిస్ ఆధిక్యత స్థిరంగా కొనసాగుతోంది. 7 కోట్ల మంది వీక్షించిన సెపె్టంబర్ పది నాటి హారిస్–ట్రంప్ బిగ్ డిబేట్ తర్వాత కూడా ఇందులో మార్పేమీ లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి కాకుండా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన వారే విజేతగా నిలుస్తారు. ప్రతి రాష్ట్రానికీ జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు కేటాయిస్తారు. ఇలా మొత్తంగా అమెరికాలో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. గెలుపు కోసం కనీసం 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెల్చుకోవాల్సి ఉంటుంది.
స్వింగ్ రాష్ట్రాల్లోనూ హారిసే
అమెరికా ఓటర్లు చాలావరకు తాము ఏ పార్టీని అభిమానిస్తామో, ఏ పారీ్టకి మద్దతు పలుకుతామో బహిరంగంగానే చెబుతారు. అంతమాత్రాన వారు పారీ్టకి ఓటేస్తారన్న గ్యారెంటీ లేదు. ఏ పారీ్టకీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లుంటారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. వీళ్ల మద్దతు దక్కిన అభ్యర్థే గెలవడం పరిపాటి. ఈసారి అందరి కళ్లూ ఏడు స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి!
స్వింగ్ స్టేట్స్‌లో అత్యధికంగా 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాతో పాటు , 10 ఓట్లున్న విస్కాన్సిన్‌లో ట్రంప్, హారిస్ సమవుజ్జీలుగా నిలవడం విశేషం! 15 ఓట్లున్న మిషిగన్, ఆరు ఓట్లున్న నెవడాల్లో హారిస్‌కు స్వల్ప మొగ్గుంది. 16 ఓట్ల చొప్పున ఉన్న నార్త్ కరోలినా, జార్జియాల్లో, 11 ఓట్లున్న అరిజోనాలో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాలన్నింటిలో కలిపి చూస్తే హారిసే సగటున 5 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు గణాంకాలు చాటుతున్నాయి.
సగటు ఎలా లెక్కిస్తారు?
రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో వేర్వేరు సంస్థలు చేసిన పోల్ సర్వేలను మదించి అభ్యర్థుల ఆదరణ తాలూకు సగటును లెక్కిస్తారు. అమెరికాలో ఏబీసీ న్యూస్‌లో భాగమైన పోలింగ్ విశ్లేషణ సంస్థ వెబ్‌సైట్ 538 దీన్ని లెక్కిస్తోంది. సర్వేలోఎంతమంది పాల్గొన్నారు, ఏ రోజున పోల్ చేపట్టారు, ఫోన్, టెక్సŠస్ట్ మెసేజ్, ఆన్‌లైన్... వీటిలో ఓటర్ల నుంచి ఎలా సమాచారం రాబట్టారు వంటి అంశాలను పారదర్శకంగా, నిజాయతీగా బేరీజు వేసి డేటాను సేకరిస్తారు. ఆ మీదట సగటును లెక్కిస్తారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment