ఓటమిని అంగీకరిస్తున్నా
శాంతియుతంగా అధికార మార్పిడి చేస్తాం
హొవార్డ్ వర్సిటీలో కమలా హారిస్ ప్రసంగం
ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన డెమొక్రటిక్ నాయకురాలు
వాషింగ్టన్: విజయతీరాలకు కాస్తంత దూరంలో నిలిచిపోయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని డెమొక్రటిక్ నాయకురాలు కమలా హారిస్ వ్యాఖ్యానించారు. హోరాహోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో పరాజయం పాలైన హారిస్ ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. గురువారం వాషింగ్టన్‌లోని హొవార్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేలాది మంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. 60 ఏళ్ల హారిస్ గతంలో ఇదే వర్సిటీలో రాజనీతి, ఆర్థికశాస్త్రం చదువుకున్నారు.
నా హృదయం నిండిపోయింది
‘‘దేశంపై ప్రేమతో, దేశం కోసం పాటుపడుతూ మీరంతా నాపై ఉంచిన నమ్మకం, ప్రేమతో ఈ రోజు నా హృదయం నిండిపోయింది. ఈ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం దక్కలేదు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మనం పోరాడలేదు. మీరంతా ఓటేసింది కూడా ఇలాంటి ఫలితం కోసం కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అభ్యున్నతి కోసం మనందరం చేసిన ప్రతిజ్ఞా జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఓడిపోయాక పార్టీ అశేష అభిమానుల్లో పెల్లుబికి వస్తున్న భావోద్వేగాలను అర్థంచేసుకోగలను. అయినాసరే ఈ ఫలితాలను అంగీకరించక తప్పదు. ఫలితం ఎలా ఉన్నా ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. నేను ఈ ఫలితాలను, ఓటమిని అంగీకరిస్తున్నా. అయితే పోరాటాన్ని మాత్రం ఆపబోను’’ అని అన్నారు.
ట్రంప్‌ను విష్ చేశా
గత ఎన్నికల్లో ఓడినాసరే ఓటమిని అంగీకరించకుండా ట్రంప్ ప్రభుత్వం సాఫీగా అధికార మార్పిడి జరక్కుండా అడ్డుకున్న అంశాన్ని హారిస్ ప్రస్తావించారు. ‘‘ అధ్యక్ష్య ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ట్రంప్‌కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. కాలపరిమితి ముగిశాక శాంతియుతంగా అధికార మార్పిడికి మా ప్రభుత్వం సాయపడుతుందని హామీ ఇచ్చా. మన దేశంలో ఒక అధ్యక్షుడికో, రాజకీయ పార్టీకో నిబద్దులై ఉండాల్సిన పనిలేదు. కానీ దేశ రాజ్యాంగానికి ఖచ్చితంగా మనం బద్ధులమై ఉండాలి. ఎన్నికలు ముగియడంతో మన పోరాటం ముగిసిపోలేదు. మన పోరాటం కొనసాగుతుంది.
అగ్రరాజ్య ఆవిర్భావానికి పునాదులైన సూత్రాలకు కట్టుబడి ఉందాం. కొన్నిసార్లు పోరాటం అనేది సుదీర్ఘకాలం కొనసాగొచ్చు. అంతమాత్రాన మనం గెలవబోమని కాదు. గెలిచేదాకా పోరాటం ఆపకపోవడమే ఇక్కడ ముఖ్యం. స్వేచ్ఛా, అవకాశాలు, పారదర్శకత, ప్రజలకు మెరుగైన జీవితం అందించేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, న్యాయం కోసం నా పోరు ఆగదు. స్వేచ్ఛ కోసం జరిపే సమరం చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని మనం ఇష్టపడతాం. మన దేశం కోసం ఆమాత్రం కష్టపడటం సబబే. ఫలితాల తర్వాత మనం ఓటమి చీకట్లోకి జారుకుంటున్నామని చాలా మంది భావించి ఉండొచ్చు. కానీ ఈ కష్టకాలం పెద్ద విషయమే కాదు’’ అని అన్నారు.
సభలో గంభీర వాతావరణం
పార్టీ ఓటమితో డెమొక్రాట్లలో ఒకింత నైరాశ్యం నిండింది. సభకు వేలాది మంది వచ్చినా సరే కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మధ్యమధ్యలో హారిస్ తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో వాళ్లలో హుషారు నింపే ప్రయత్నంచేశారు. పార్టీ సీనియర్ నేతలు కొందరు ప్రసంగించారు. దిగువసభ మాజీ మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ, డీసీ మేయర్ మురేల్ బౌసర్ తదితరులు మాట్లాడారు. పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు యువ ఓటర్లు, మద్దతుదారులు సభలోనే కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment