
తెలంగాణకు హైటెక్కులు దిద్దింది నేనే
- నా వల్లే రాష్ట్రంలో మిగులు బడ్జెట్: ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి తాను అడ్డుపడుతున్నానన్న టీఆర్‌ఎస్ నేతల విమర్శ లు అర్థరహితమని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను అధికారం చేపట్టేనాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి హైటెక్ రాష్ట్రంగా తీర్చిదిద్దానని చెప్పారు.
శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందంటే అందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అందించిన పాలనే కారణమన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకూడదనే తాను ఢిల్లీలో కృషి చేసినట్టు తెలిపారు.
ఒక్కో ఇటుక పేర్చాలి: ప్రస్తుతం ఏపీలో రాజధాని కూడా లేదని, ఒక్కో ఇటుక పేర్చుకుని వెళ్లాల్సి ఉందన్నారు. తెలంగాణ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలను మాట్లాడ కుండా సస్పెన్షన్లు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
పెరిగిన టీడీపీ సభ్యత్వం: గతంలో కన్నా పార్టీ సభ్యత్వం పెరిగిందన్నారు. తెలంగాణలో 35 ఏళ్లుగా బుల్లెట్ లాంటి కార్యకర్తలు గలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని, 2019లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. ఖమ్మం జిల్లా టీడీపీ సభ్యత్వం లో మొదటి స్థానంలో ఉంటే వరంగల్, మహబూబ్‌నగర్‌లు 2,3 స్థానాల్లో ఉన్నాయన్నారు.
అరచేతిలో వైకుంఠం: టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వెనక్కు వెళుతోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కే సీఆర్‌కు పట్టడం లేదన్నారు. రోజుకో మాట చెపుతూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.
టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణకున్న కరెంటు కష్టాలు తెలిసీ, అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కొనుగోలును పట్టించుకోకుండా పక్కరాష్ట్రాన్ని తూలనాడే దౌర్భాగ్యం టీఆర్‌ఎస్‌దన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ నేతలు సండ్ర వెంకటవీరయ్య, కృష్ణయాదవ్, మాగంటి గోపీనాథ్, గాంధీ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.