
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పూర్తి మద్దతు: ఉత్తమ్
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పూర్తిమద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం కూడా కాంగ్రెస్ చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై శనివారం గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం జరిపే అఖిల పక్షసమావేశంలో తాను పాల్గొంటానని, వర్గీకరణ తొందరగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
అనంతరం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీల వర్గీకరణ జరిగేదని, అయితే అప్పట్లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఆలస్యమయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ అఖిలపక్షం భేటీతో చేతులు దులిపేసుకోవద్దని హితవు పలికారు. వర్గీకరణ బిల్లు అమలయ్యేలా కృషి చేయాలని కోరారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒత్తిడితోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిందని, ఇప్పుడు వర్గీకరణ అవుతుందంటే అది కాంగ్రెస్ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు.