‘థర్మల్’పై నివేదిక రెడీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని దామరచర్ల మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన 7500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన భూముల సర్వే నివేదిక సిద్ధమైంది. ఈ నివేదికను కలెక్టర్ టి.చిరంజీవులు ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సమర్పించనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు గాను వీర్లపాలెం - దిలావర్‌పూర్ అటవీరేంజ్‌లో మొత్తం 10,600 ఎకరాలను అధికారులు సర్వే నిర్వహించగా, ఇందులో ఉన్న భూముల వివరాలను డిజిటల్ మ్యాపులతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ నివేదిక కోసం జిల్లా యంత్రాంగం గత పదిరోజులుగా నిరంతరాయంగా శ్రమించింది. అయితే, జిల్లా నుంచి నివేదిక వెళ్లినా, ఎన్టీపీసీ, జెన్‌కో సంస్థలు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి సీఎం కేసీఆర్.. జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదికతో ప్రాథమిక ప్రతిపాదనలను కేంద్రం ముందుంచినా, ఆ రెండు సంస్థల నుంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను కేంద్రం పరిశీలించనుందని అధికారవర్గాలు చెపుతున్నాయి.
అంతా అటవీభూమే
దామరచర్ల మండలంలోని అటవీప్రాంతంలో ఉన్న భూములను మాత్ర మే జిల్లా యంత్రాంగం సర్వే చేసింది. ఇందుకోసం మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో 773, వీర్లపాలెంలో 2890, తాళ్లవీరప్పగూడెంలో 481, దిలావర్‌పూర్‌లో 786, కొండ్రపోలులో 945, నర్సాపురంలో 907, కల్లేపల్లి గ్రామంలో ఉన్న 2204 ఎకరాలు మొత్తం 8986 ఎకరాల సర్వే జరిగింది. శుక్ర, శనివారాల్లో తిమ్మాపురం, కొత్తపల్లి గ్రామాల్లో కూడా సర్వే జరిగినా ఇందుకు సంబంధించిన లెక్కలు తేలాల్సి ఉంది. మొత్తంమీద 10,600 ఎకరాల భూములను సర్వే చేసినట్టు అధికారులు చెపుతున్నారు. అయితే, ఇదంతా అటవీభూమి మాత్రమేనని, ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూములను తాము సర్వే చేయలేదని, ఫారెస్టు మధ్యలో పట్టాభూములున్న 20 మంది రైతులకు సంబంధించిన 50 ఎకరాలు మాత్రమే ప్రైవేటు భూమి ఉందని అధికారులు చెపుతున్నారు. ఈ మేరకు నివేదికలో పొందుపరచనున్నారు. అదే విధంగా భూములు, నివాససముదాయాలు నష్టపోతున్న వారికి ఇవ్వాల్సిన పరిహారం వివరాలను కూడా ఈ నివేదికలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.
ప్రత్యేక కృషి..
తక్కువ కాలంలోనే వేల ఎకరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడంలో జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించిందని చెప్పుకోవాలి. కలెక్టర్‌కు గతంలో భూసేకరణ, సర్వే నిర్వహించడంలో ఉన్న అనుభవంతో ఆయన పకడ్బందీ ప్రణాళికతో ఈ సర్వే ప్రక్రియను నడిపించారు. మొత్తం 21 బృందాలను ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన సర్వే నిర్వహించారు. మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, ఇతర అధికారులు మండల ప్రజలకు సర్దిజెప్పి సర్వేకు సహకరించాల్సిందిగా కోరారు. మొత్తంమీద గత నెల 26న ప్రారంభమైన సర్వే కార్యక్రమం వారం రోజుల్లోపే పూర్తికావడం, వెంటనే నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పదిరోజుల్లోపే అందజేయడం వెనుక జిల్లా యంత్రాంగం ప్రత్యేక కృషి ఉందనే చెప్పుకోవాలి.
అది టైగర్‌జోన్..
ఇక, దామరచర్ల మండలంలో తీసుకునే అటవీ భూమికి బదులుగా దేవరకొండ డివిజన్‌లోని 6,500 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రత్యామ్నాయంగా జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. దీనికితోడు జిల్లాలోని ఫారెస్టు భూములకు ఆనుకుని ఉన్న మరో వెయ్యి ఎకరాలను కూడా అట వీశాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావి స్తోం ది. అయితే, మొదట్లో నేరేడుచర్ల మండలంలోని భూములను ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు ఇవ్వాలని భావించినా, ఆ తర్వాత నిర్ణయం మా రింది. దేవరకొండ ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూమి ఉన్నా వినియోగించుకోలేకపోతున్నామని, అదంతా నల్లమలకు అనుకుని ఉన్నందున అక్కడి ప్రాంతాన్ని టైగర్, వన్యప్రాణి జోన్‌గా ప్రకటించారని, దీంతో ఈ భూ ములు నిరుపయోగం ఉంటున్నాయని అధికారులు చెపుతున్నారు. ఇక్కడ భవిష్యత్తులో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం లేదని, ఇతర ప్రాజెక్టులకు నష్టపరిహారంగా కూడా ఆ భూములను ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించే పరిస్థితి లేదని అధికారవర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవరకొండ డివిజన్‌లోని అట వీభూములను దామరచర్ల భూములకు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్టు చెబుతున్నాయి.