- పథకాల అమల్లో చేస్తున్న విశేష కృషికి గౌరవం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకె ళ్లేందుకు అవిరళ కృషి చేస్తున్న ఆల్ ఇండియా సర్వీసు అధికారులను స్వాతంత్య్ర దినోత్సవాన సన్మానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ కిట్ పథకాన్ని విజయవంతం చేయడం, ప్రభుత్వ వైద్యశాలల పనితీరును మెరుగు పరచడంలో విశేష కృషి చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను విశిష్ట సేవలందించిన ఐఏఎస్ అధికారిగా గుర్తించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను సమర్థంగా నడుపుతూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, పౌరసరఫరాల వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్న సీవీ ఆనంద్‌లను ఐపీఎస్ కేటగిరీలో, మైనారిటీ గురుకుల పాఠశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎండీ షఫీవుల్లాను ఐఎఫ్‌ఎస్ అధికారుల విభాగంలో సన్మానానికి ఎంపిక చేశారు. మంగళవారం గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో సీఎం కేసీఆర్ వారిని సత్కరించ నున్నారు.