దొంగలు బరితెగించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి 7 తులాల బంగారు గొలుసుతో పాటు రూ. 1.5 లక్షల నగదు అపహరించుకుపోయారు.
* కత్తితో మహిళను బెదిరించి 7 తులాల బంగారు గొలుసు, రూ. 1.5 లక్షలు దోపిడీ
* ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కౌన్సిలర్ ఇంట్లో ఘటన
ఇబ్రహీంపట్నం: దొంగలు బరితెగించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి 7 తులాల బంగారు గొలుసుతో పాటు రూ. 1.5 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్‌నగర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఎంబీఆర్‌నగర్‌లో నగర పంచాయతీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి నివాసముంటున్నారు. ఆయన రియల్ వ్యాపారం చేస్తుంటారు. ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం ఇంటికి వచ్చారు. రూ. 1.5 లక్షలు హాల్‌లోని టేబుల్ డ్రాలో ఉంచి తిరిగి బయటకు వెళ్లారు.
6:30 గంటలకు ముగ్గురు యువకులు ఇంటికి వచ్చారు. ఒంటరిగా ఉన్న యాదగిరి భార్య వసంత ఏం కావాలి..? అని వారిని ప్రశ్నించింది. టూలెట్ బోర్డు ఉందని ఇంటి అద్దె కోసం వచ్చామని తెలిపారు. గదులు అద్దెకు లేవని ఆమె వారికి చెప్పింది. ఇంతలో యువకులు సోఫాసెట్‌లో కూర్చున్నారు. దాహంగా ఉంది, నీళ్లు కావాలని తెలిపారు. యువకుల తీరును అనుమానించి వసంత కొంతసేపు అక్కడే నిలబడింది. ఇంతలోనే యువకులు సోఫాలోంచి లేచి వసంత వద్దకు వచ్చారు.
ఆమెను కత్తితో బెదిరించి మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసును తెంచుకున్నారు. ఈక్రమంలో వసంత ప్రతిఘటించడంతో ఆమెచేతికి కత్తి తగిలి గాయమైంది. ఒక్కసారిగా షాక్‌కు గురైన వసంత కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలో మిగతా ఇద్దరు దుండగులు బీరువాలను తెరచి సోదా చేశారు. హాల్‌లోని టేబుల్ డ్రాలో ఉన్న రూ, 1.5 తీసుకున్నారు. వసంత తేరుకునేలోపు బైక్‌పై పరారయ్యారు.
కొద్దిసేపటి తర్వాత తేరుకున్న వసంత విషయం స్థానికులకు చెప్పింది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ, సీఐ మహమ్మద్‌గౌస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూంస్‌టీం, జాగిలాలతో ఆధారాలు సేకరించారు. దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. వసంత ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి భర్త ఆకుల యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.