ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌  | ICMR is given green signal for plasma therapy | Sakshi
Sakshi News home page

ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ 

Published Wed, Apr 29 2020 1:59 AM | Last Updated on Wed, Apr 29 2020 1:59 AM

ICMR is given green signal for plasma therapy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారినపడి గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అత్యవసర రోగులకు ప్లాస్మా థెరపీ అందించేందుకు అనుమతి లభించింది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు పచ్చజెండా ఊపాయి. తెలంగాణలో సోమవారం రాత్రి వరకు 1,003 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 332 మందికిపైగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 25 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 646 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏడుగురి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరంతా వెంటిలేటర్‌పై ఉన్నారు. వీరిని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ఒక్కటే పరిష్కారమని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి వైద్య బృందం అనుమతుల కోసం ఐసీఎంఆర్‌ సహా డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డుకు దరఖాస్తు చేసింది. డాక్టర్‌ రాజారావు నేతృత్వంలో ఎథికల్‌ కమిటీని కూడా ఎంపిక చేసింది. తాజాగా ఐసీఎంఆర్‌ ప్లాస్మా థెరపీ నిర్వహణకు అనుమతులిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్‌ బారినపడి చికిత్సానంతరం పూర్తిగా కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 

ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారంటే.. 
ప్లాస్మా థెరపీ నిర్వహించాలంటే ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణై, చికిత్స తర్వాత కోలుకుని, నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన దాతలు అవసరం. అంటే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారన్న మాట. వీరికి హెపటైటిస్‌ బీ, సీ సహా, హెచ్‌ఐవీ ఇతర జబ్బులు ఉండకూడదు. దాత వయసు కూడా 20 నుంచి 40ఏళ్లలోపు ఉండాలి. ఆస్పత్రిలోని ఎథికల్‌ కమిటీ.. దాతలు సహా స్వీకర్తలను ఎంపిక చేస్తుంది. సింగిల్‌ డోనర్‌ ద్వారా ప్లాస్మా సేకరిస్తారు. ఇందుకు దాతలను సింగిల్‌ డోనర్‌ ప్రాసెస్‌ (ఎస్‌డీపీ) మిషన్‌కు అనుసంధానం చేస్తారు. ఈ మిషన్‌ దాత శరీరంలోని సాధారణ రక్తం నుంచి నీటిరూపంలో ఉండే పసుపు రంగు ద్రావణాన్ని (ప్లాస్మా) వేరు చేస్తుంది. రక్తం యథావిధిగా దాత శరీరంలోకి తిరిగి వెళ్లిపోతుంది.

కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్‌ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. కరోనాను జయించిన దాత ప్లాస్మాలో ఈ యాంటిబాడీస్‌ ఎక్కువగా ఉంటా యని వైద్యనిపుణులు అంటున్నారు. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్‌ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. వీటిని కనీసం నలుగురు బాధితులకు అందించి కాపాడవచ్చు. ఇలా సేకరించిన కణాలను అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఎక్కిస్తారు. ఈ ప్లాస్మా కణాలను శరీరంలోకి ఎక్కించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీబాడీస్‌ను పెంచడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, వైరస్‌ బారి నుంచి బాధితులు త్వరగా కోలుకుంటారు.

ఢిల్లీలో ఇప్పటికే విజయవంతం 
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్లాస్మాథెరపీ ఓ ఆరోగ్య సంజీవనిగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికాలో ఇప్పటికే 600 మందికి ఈ ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసినట్లు తెలిసింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో 49ఏళ్ల వ్యక్తికి ప్లాస్మా థెరపీ నిర్వహించడంతో ఆయన విజయవంతంగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. కేరళ, మహారాష్ట్రలోనూ ఈ తరహా చికిత్సలు కొనసాగుతున్నాయి. తాజాగా గాంధీలో చికిత్స పొందుతున్న ఏడుగురు రోగులకు ఇదే తరహాలో చికిత్స చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దాతలను కూడా ఎంపిక చేసినట్లు తెలిసింది. అన్నీ సవ్యంగా జరిగితే ఒకట్రెండు రోజుల్లో ఈ తరహా చికిత్సను ప్రారంభించే అవకాశం లేకపోలేదని ఓ వైద్యుడు చెప్పారు.   

ప్లాస్మా డోనర్లు రెడీ
రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడి పూర్తిగా కోలుకున్న 32 మంది వ్యక్తులు ఇతర రోగుల ప్రాణాలను రక్షించేందుకు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. ప్లాస్మా దానం చేసేందుకు సంసిద్ధత తెలిపిన 32 వ్యక్తుల జాబితాను లేఖతో పాటు పంపించారు. ప్లాస్మా దాతలు ముందుకు రావడంతో కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం బలోపేతం అవుతుందని అసదుద్దీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి కోలుకున్న తబ్లీగీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఆయన మంత్రికి పంపిన జాబితాలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement