
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనల ప్రకంపనలు ఇంకా ఆగలేదు. ఆయన పార్టీ మారుతున్నారని ఇప్పటికే నిర్ధారణ కాగా, ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీని వీడి పోయేవారెందరు..? కాంగ్రెస్‌లో కొనసాగే వారెందరు..? ఆయన పార్టీ మారడం వల్ల ఏ నియోజకవర్గాల్లో పడే ప్రభావం ఎంత..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పార్టీ కేడర్‌లోనూ ఈ అయోమయం కొంత గందరగోళానికి దారితీస్తోందని చెబుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భువనగిరి లోక్‌సభస్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా ఆయన మొదట జనగామ, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకుడిగా ప్రచారమయ్యారు.
ఐదేళ్ల పాటు తెలంగాణ నినాదాన్ని మోయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువమంది అభిమానులనే సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఆయన భువనగిరి నుంచే రెండోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీపడి ఓడిపోయారు. కానీ, కొన్నాళ్లకే వచ్చిన నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సంబంధాలు నెలకొల్పుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సొంత కేడర్‌ను తయారు చేసుకున్నారు.
మొన్నటి 2018 ముందస్తు ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, పీసీసీ నాయకత్వాన్ని ఆశించిన ఆయనకు ఆశాభంగం కావడం వల్లే పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ప్రకట నలు పార్టీ శ్రేణుల్లో సంచలనం కలిగించాయి. ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు ఈ నెల 24వ తేదీని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని చెబుతుండడంతో పార్టీపై పడే ప్రభావం, ఎందరు పార్టీని వీడి బయటకు వెళతారు అన్న చర్చ మొదలైంది.
ఉండే వాళ్లెందరు... పోయే వాళ్లెందరు?
మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి కేవలం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కానందున, ఆయనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పరిచయాలు, అనుచరవర్గం ఉన్నందున, ఆయన పార్టీ మారితే పడే ప్రభావంపై నాయకత్వం అంచనావేస్తోంది. ప్రధానంగా భువనగిరి లోక్‌సభనియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనతో వెళ్లే కేడర్, లీడర్లు ఎంతమంది ఉంటారన్న అంచనాల్లో కాంగ్రెస్ నాయకత్వం మునిగిపోయింది.
మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి తదితర నియోజకవర్గాలనుంచి ఎవరైనా పార్టీ మారుతున్నారా అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రధానంగా మునుగోడు నుంచి ఆయన వెంట వెళ్లేవారెందరు..? పార్టీలోనే ఉండిపోయే వారెందరు..? అన్న అంచనాలు వేస్తున్నారు. అయితే, ముందునుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సీనియర్లు, ముఖ్య కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతారని, ఆయనతోపాటు వెళ్లే వారి సంఖ్య పెద్దగా ఉండదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
ఈ మేరకు తమ కేడర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఒక వైపు ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నారని తెలిసిన తర్వాత ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్న కొందరు నాయకులు అప్పుడే ఇన్‌చార్జ్ బాధ్యతలు దక్కించుకునే రేసులో మునిగిపోయారని, కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలను పక్కనపెట్టి ఇన్‌చార్జి పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ మార్పిడిపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతుండగా, స్వల్ప సంఖ్యలోనే ఆయన వెంట వెళ్తారన్న అంచనాలో పార్టీ నాయకత్వం ఉంది. మొత్తంగా ఈ నెల 24వ తేదీ తర్వాత కానీ, మునుగోడు, ఇతర నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పార్టీ మారుతారు? ఎవరు మిగిలిపోతారు ? అన్న ప్రశ్నలకు సమాధానం లభించేలా లేదు.
Comments
Please login to add a commentAdd a comment