మీ వల్ల కాకపోతే సెలవు పెట్టుకోండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.410 కోట్లు గత యేడాది నవంబరులో మంజూరు చేశాం. టెండర్ వ్యవధిని కుదించినా పనులు ప్రారంభం కావడం లేదు. ఈ రకమైన ఆలస్యాన్ని సహించేది లేదు. మీ వల్ల కాకపోతే సెలవు పెట్టుకుని వెళ్లండి’అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ అతిథి గృహంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, డీఆర్‌డీఏ, డ్వామా శాఖల పనితీరుపై అధికారులతో మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డితో పాటు ఆయా శాఖల రాష్ట్రస్థాయి అధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం తేడా లేకుండా రూ.410 కోట్లు పీఆర్ రోడ్లకు మంజూరు చేసినా పనులు ఆలస్యం కావడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో సామాజిక పింఛన్ల పథకం ‘ఆసరా’ లబ్ధిదారుల సంఖ్య తగ్గడంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘మహబూబ్‌నగర్ జిల్లాలో పేదరికం మాయమైందా. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య పెరిగి ఇక్కడ ఎందుకు తగ్గింది. 14వేల నుంచి 4వేలకు చేనేత పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య పడిపోవడం అసాధారణం. పింఛను మొత్తాన్ని పెంచినా మాకు చెడ్డపేరు రావడం దరిద్రం’ అని అసహనం వ్యక్తం చేశారు. సదరం క్యాంపులను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
స్థల సేకరణ పూర్తిచేయండి
వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలో 776.25 కిలోమీటర్ల మెయిన్ లైను, 9 ఫిల్టర్ బెడ్లు, 15 పంపింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్, జూరాల ప్రాజెక్టు నుంచి రెండు సెగ్మెంట్లుగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఫిల్టర్ బెడ్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ జరపాల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలో 355 పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.53.25కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా, మరోమారు వివరాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు.
నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పింఛన్ల మంజూరు అవకతవకలపై మరోమారు పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో గోడౌన్ల నిర్మాణానికి అనువైన స్థలాలు గుర్తించాల్సిందిగా ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు కేవలం 200 గ్రామాల్లో ప్రారంభం కావడం, 30వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించడం, ఇందిర జలప్రభ పురోగతిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్‌షెడ్ పథకం పనులు త్వరితగతిన సాగేలా చూడాలన్నారు.
జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసులకు కొత్త వాహనాలు అందించి నాగర్‌కర్నూలుకు చేరుకున్నారు. అనంతరం జొన్నలబొగుడ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సాతాపూర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులోని ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌ను సందర్శించారు. భోజన విరామం అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, కలెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.